కంగారూ జీవిని చూశారా.. కడుపు పొత్తిళ్లలో తన పిల్లలను వేసుకుని వెళ్తుంటుంది. తన పిల్లలను ఒడిలో దాచుకుంటుంది. అదే మాదిరి మనుషులకు కూడా సరికొత్త విధానంలో తెలంగాణ వైద్యులు వైద్యం అందిస్తున్నారు. దాని పేరే ‘కంగారూ ఫాదర్ కేర్’. ఈ విధానం ప్రజలందరి ప్రశంసలు అందుకుంటుంది. తెలంగాణ వైద్యులు కొత్తగా చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తోంది. అయితే ఆ వైద్య విధానం ఏమిటీ? దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటీ? పిల్లలకు జరిగే మేలు ఏమిటో తెలుసుకుందాం.
అప్పుడే పుట్టిన శిశువుల్లో ఎదుగుదల అనేది చాలా ముఖ్యం. తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు ఇన్ ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. అందుకే వారి ఎదుగుదల కోసం తల్లి పొట్ట, ఛాతీభాగంలో శిశువును గట్టిగా కట్టి కొన్ని గంటల పాటు ఉంచేవారు. ఇన్నాళ్లు తల్లులతో ఆ ప్రయత్నం చేసేవారు. కానీ కరీంనగర్ వైద్యులు ఇప్పుడు తండ్రుల ద్వారా కూడా చేయడం మొదలుపెట్టారు. ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ ప్రయత్నానికి ‘కంగారూ ఫాదర్ కేర్’ అని నామకరణం చేశారు. కరీంనగర్ లోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలోని ఎన్ఐసీయూ విభాగంలో తండ్రులతో సరికొత్తగా ఈ ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇస్తోందని ఆస్పత్రి పిల్లల వైద్యుడు డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు.