Car Interiors : కార్ ఇంటీరియర్‌ని శుభ్రపరచాలా..? ఇవిగో టిప్స్
కార్ని ఇంటి దగ్గర శుభ్రం చేసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సర్వీసింగ్‌కి తీసుకెళ్లి ఇచ్చేస్తే పనైపోతుందనుకుంటారు. అయితే కారు ఇంటీరియర్‌ని ఇంట్లోనే చక్కగా శుభ్రం చేసుకునే ప్రో టిప్స్ ఇక్కడున్నాయి.
Car Interiors cleaning : లక్షలు పెట్టి కార్ని కొనుక్కుంటారు కానీ కొంత మంది దాని శుభ్రత విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడో ఒకసారి సర్వీసింగ్‌కి ఇచ్చేస్తే వాళ్లే అన్నీ శుభ్రం చేసి ఇస్తారని అనుకుంటారు. అయితే లేనిపోని చెత్త అంతా కారు లోపల పేరుకుపోతే ఆ వాతావరణం ఆహ్లాదకరంగా లేనట్లు అనిపిస్తుంది. దుర్వాసనలు వచ్చే అవకాశాలూ ఉంటాయి. ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే కొన్ని చిట్కాల్ని పాటిస్తూ దాన్ని మనం ఇంట్లోనే శుభ్రం(Cleaning) చేసుకోవచ్చు.
కారులో తినడం చాలా వరకు తగ్గించుకోవాలి. అప్పుడు దానిలో ఆహార పదార్థాలకు సంబంధించిన పార్టికిల్స్ పేరుకోకుండా ఉంటాయి. అలాగే ఒక వేళ తిన్నా ఆ కవర్లు, బాక్సుల్లాంటి వాటిని అన్నింటినీ ఒక కవర్లో పెట్టి ఉంచుకుని దిగేడప్పుడు కచ్చితంగా దాన్ని తీసేయాలి. అవి అలా ఉండిపోతే కారు(Car)లో దుర్వాసన వస్తుంది. చెత్త, టిష్యూ పేపర్ల లాంటి వాటిని సాథ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు తొలగించేయాలి. కారులో వాసన బాలేదనుకుంటే సీట్ల దగ్గర బేకింగ్ సోడాను చల్లి కొన్ని గంటలు అలా వదిలేయాలి. బయటకు వెళ్లే ముందు దాన్ని క్లీన్ చేసి కారెక్కితే వాతావరణం తాజాగా మారుతుంది. అలాగే స్పీకర్లు, ఏసీ వెంట్ల దగ్గర పేరుకున్న దుమ్మును తొలగించేందుకు ఇప్పుడు కొన్ని రకాల జెల్లీల్లాంటివి దొరుకుతున్నాయి. వాటిని ప్రయత్నించవచ్చు.
చిన్న చిన్న కార్ వాక్యూమ్ క్లీనర్లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి దాన్ని కార్ కోసం ఒకటి పెట్టుకోవాలి. అది చిన్న చిన్న పార్టికిల్స్ని సైతం చక్కగా క్లీన్ చేస్తుంది. అలాగే కారు సీట్లను క్లీన్ చేయడానికి ఫ్యాబ్రిక్ ఫోమ్ క్లీనర్లు దొరుకుతాయి. మచ్చలు పడినట్లు ఉంటే వీటిని ప్రయత్నించవచ్చు. లెదర్‌ని శుభ్రం చేయడానికి తేలికపాటి సోప్ లిక్విడ్‌ని వాడితే సరిపోతుంది. మెత్తగా ఉండే వస్త్రానికి సబ్బు నీటిని అద్ది మెల్లగా తుడిచేసుకోవచ్చు. తర్వాత పొడి వస్త్రంతో మరోసారి తుడిస్తే లెదర్ కూడా తళతళా మెరుస్తూ ఉంటుంది. అయితే లెదర్‌కి ఎప్పుడూ నీరు ఎక్కువగా తగలకుండా చూసుకోవాలి.