అధికారం మారాలంటే నేతలు కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఉచిత పథకాలు, హామీలు ఇవ్వడంతోపాటు జనంతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు, జగన్ కూడా పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర సీజన్ నడుస్తోంది. ఏపీలో వారాహి వాహనంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, యువగళం పేరుతో నారా లోకేశ్, తెలంగాణలో షర్మిల, బండి సంజయ్ పాదయాత్ర చేపడుతున్నారు.
టీడీపీ, బీజేపీ మధ్యలో జనసేన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో ఆంధ్రప్రదేశ్ పర్యటిస్తారు. ఈ రోజు (మంగళవారం) నుంచి నరసింహ స్వామి క్షేత్రాలను సందర్శించడం ప్రారంభించారు. ధర్మపురి ఆలయంలో దర్శనంతో పవన్ యాత్ర ప్రారంభం అయ్యింది. వారాహి వాహనంలో రాష్ట్రమంతా పర్యటిస్తారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 గురించి ప్రస్తావించారు. అణచివేత ధోరణి గురించి, ఇచ్చే హామీల గురించి చెబుతారు. గత ప్రభుత్వం ఆయన లాగే ఆలోచిస్తే జగన్ పాదయాత్ర చేసేవారా అని పవన్ కల్యాణ్ గుర్తుచేస్తున్నారు. 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. కాపు ఓటు బ్యాంకు టీడీపీకి మళ్లింది. అనూహ్యంగా టీడీపీ అధికారం చేపట్టింది. ఐదేళ్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక్క అసెంబ్లీ సీటును మాత్రం గెలుచుకోగలిగింది. పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తమ పార్టీ పోటీకి దిగుతుందని, పొత్తుల గురించి కూడా పవన్ కల్యాణ్ చెబుతున్నారు. టీడీపీతో పొత్తు కన్ఫామ్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటు బీజేపీతో కూడా బానే ఉంటున్నారు. ఆ పార్టీ మాత్రం కలిసి పోటీ చేయబోం అని చెబుతోంది. ఈ సారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను క్యాష్ చేసుకోవాలని పవన్ భావిస్తున్నారు. పవన్ వెంట ఉన్న కాపు ఓట్లను తమవైపు తిప్పుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారట. అందుకే పవన్‌తో సమావేశమై.. చర్చలు జరిపారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తమకు పాజిటివ్ అయ్యే ఏ ఒక్క అవకాశాన్ని చంద్రబాబు వదులుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
లోకేశ్ ‘యువగళం’
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి యాత్ర ప్రారంభం కానున్నది. పాదయాత్రకు పోలీసులు ఎట్టకేలకు పర్మిషన్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చుట్టేయాలని యువనేత ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. జగన్ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపి, జనం నుంచి సానుభూతి పొందాలని అనుకుంటున్నారు. సీఎం జగన్ టార్గెట్‌గా యాత్ర కొనసాగుతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. లోకేశ్‌కు ఇంక అనుభవం రాలేదని, గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయారని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఆయన ఏం చేశారని, యాత్ర చేపడుతున్నారని విమర్శలు చేస్తున్నారు.
షర్మిలక్క జోష్?
వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో సోదరుడు జగన్ కోసం మరో ప్రజా ప్రస్థాన యాత్ర కూడా చేశారు. 3 వేల పైచిలుకు కిలోమీటర్ల మేర నడిచారు. ఇప్పుడు కూడా 3500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి జనం బాధలను తెలుసుకున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి పాదయాత్ర చేపడుతానని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలోకి దిగుతానని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపడుతూ.. జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ ఘటన తర్వాత సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడంతో బీఆర్ఎస్ నేతలు, వైఎస్ఆర్ టీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ప్రగతి భవన్ వెళ్లేందుకు షర్మిల ట్రై చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. ఆమె తల్లి విజయమ్మ, భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా వచ్చి పరామర్శించారు. రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉంటూ.. తన ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదీ ఏ మేరకు ఫలిస్తుందో చెప్పలేమని మేధావుల మాట. కానీ తాను కూడా బరిలో ఉన్నానని చెబుతున్నారు.
15 మంది నేతలే?
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నారు. ఇప్పటికే ఐదు విడతల పాదయాత్ర పూర్తి చేశారు. యాత్రలో భాగంగా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపారు. పల్లెలతోపాటు పట్టణాలు, నగరాల గుండా పాదయాత్ర సాగింది. తమ పార్టీ బలోపేతం చేసేందుకు అడుగు వేశారు. నేతలు విభేదాలు పక్కన పెట్టాలని చెప్పి జనంతో కలిసిపోయారు. యాత్ర ఎక్కడ కొనసాగిన బ్రహ్మారథం పట్టారు. తమకు అధికారం అప్పగిస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా కేసీఆర్ సర్కార్ ఖర్చు పెట్టడం లేదని విమర్శించారు. బీజేపీకి నేతలు ఉన్నా క్యాడర్ లేదు. ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న నేతలు 10 నుంచి 15 మంది వరకు ఉంటారు. మిగతా చోట్ల ఆ పార్టీకి అభ్యర్థులే లేరు. యాత్ర చేపట్టి.. శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు బండి సంజయ్. కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ కన్నా గట్టిగా విమర్శిస్తున్నారు.
2 నెలలు రేవంత్ రెడ్డి యాత్ర
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేపడుతానని స్పష్టంచేశారు. జనవరి 26వ తేదీన ప్రారభిస్తానని ఇటీవల మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 2 నెలలపాటు పాదయాత్ర ఉంటుందని తెలిపారు. భద్రాచలం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని.. యాత్రలో ప్రియాంక గాంధీ, లేదంటే సోనియాగాంధీ పాల్గొనేలా తీర్మానం చేశామన్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ యాత్రలో రేవంత్ యాక్టివ్‌గా పాల్గొన్నారు. తన యాత్ర పేరును మాత్రం రేవంత్ ప్రకటించలేదు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు జనంలోకి వెళుతున్నామని చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చింది తమ పార్టీయేనని అంటున్నారు. ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన తమకు ఒకసారి అధికారం ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం కబంధహస్తాల్లో చిక్కుకుందని మండిపడ్డారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ కీ రోల్ పోషించాలని.. తెలంగాణ ఇచ్చిన ఆ పార్టీకి జనం నుంచి ఆశించిన ఫలితం రాలేదని మేధావులు అంటున్నారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ కాస్తా బలంగానే ఉన్నా.. 2018లో ముందస్తుకు వెళ్లినా కేసీఆర్ మరోసారి అధికారం చేపట్టారు. అందుకు కారణం రాహుల్ గాంధీతో చంద్రబాబు వేదిక పంచుకోవడమేనని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. లేదంటే తమ పార్టీ విజయం సాధించేందని చెబుతున్నారు. సీట్ల కేటాయింపు కూడా చాలా ఆలస్యమైంది.. సీట్లు ప్రకటించే లేటవడంతో అభ్యర్థులు నియోజకవర్గాల్లో తిరగలేకపోయారు. ఈ అంశాలు అప్పటి టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చాయని అంటున్నారు. కాంగ్రెస్ నేతల్లో సమన్వయం ఉండకపోవడం మైనస్ అని ఆనలిస్టులు చెబుతున్నారు. రేవంత్ వచ్చినా.. ఆయనకు సపోర్ట్ చేసేవారి కంటే.. విభేదించేవారే ఎక్కువ, ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో విశ్లేషకులు చెప్పారు. కలిసికట్టుగా పనిచేయాలని హై కమాండ్ చెబుతోంది. ఇటీవల ఇంచార్జీ ఠాక్రే కూడా నేతలకు అదే విషయం స్పష్టంచేశారు. రేవంత్ పాదయాత్రతో అయినా కలిసి రావాలని కోరుతున్నారు.
రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో యాత్ర చేస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా యాక్టివ్‌గా రాహుల్ పాల్గొన్నారు. నేతలు/ శ్రేణులతో కలిసి ఉత్సాహంగా ఆడి పాడారు. మిగతా చోట్ల కూడా అదే జోష్ కనబరిచారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారం చేపట్టేందుకు శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. అంతా విభేదాలను పక్కనపెట్టాలని మరీ మరీ చెబుతున్నారు. ప్రధాని మోడీ, బీజేపీ నేతల లక్ష్యంగా ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ పాదయాత్రతో కదం తొక్కారు. తమకు అధికారం అప్పగించాలని కోరుతున్నారు.