‘సంజయ్ దొర మీకు దండాలు, మున్సిపల్ చైర్మన్ పదవీకి రాజీనామా చేస్తున్నా’ అని నిన్న జగిత్యాల మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి మీడియా ముందుకు వచ్చారు. శ్రావణి ఆరోపణలపై అధికార పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. శ్రావణి వెనక బీజేపీ నేతలు ఉన్నారని తిప్పికొట్టారు. ఈ విషయం కౌన్సిలర్లే తనకు ఫిర్యాదు చేశారని వివరించారు. ఆమె రాజీనామా చేయగా బీజేపీ ఫేస్బుక్ లైవ్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఆమెను తాను వేధించలేదని స్పష్టంచేశారు. బీజేపీ నేతల ప్రోద్బలంతోనే తనపై ఆరోపణలు చేసిందని వివరించారు.
స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇబ్బందికి గురిచేస్తున్నారని జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవీకి బోగ శ్రావణి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. అవిశ్వాస తీర్మానం పెడతామని శ్రావణి బెదిరించారట. 23 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేఖ ఇచ్చారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం వద్దని హైకమాండ్ స్పష్టంచేయడంతో అక్కడికి గొడవ సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. శ్రావణి రాజీనామా చేయడంతో కలకలం రేగింది.
తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు. తాను చేసిన వ్యాఖ్యలు అబద్దం అని ఎమ్మెల్యే తన మనమరాలి మీద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. సంజయ్ స్పందించారు.. మనమరాలిపై మాత్రం ప్రమాణం చేయలేదు.
సంజయ్ కుమార్ నేత్ర వైద్య నిపుణుడు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డిని ఓడించారు. నియోజకవర్గంలో సంజయ్కు అంతగా పట్టులేదని స్థానిక నేతలు అంటుంటారు. కల్వకుంట్ల కవిత పోటీ చేస్తానంటే తాను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని అప్పట్లో సంజయ్ ప్రకటించారు. కల్వకుంట్ల ఫ్యామిలీతో సంజయ్ కుమార్ బంధువు అవుతారు.