ఇటీవల విడుదలైన పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని చాలా మంది స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షలో ఫెయిల్ అయితే ఇంట్లో ఏమంటారో అని మానసిక వేదనకు గురవుతున్నారు.
Fake kidnap : ఇటీవల విడుదలైన పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని చాలా మంది స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షలో ఫెయిల్ అయితే ఇంట్లో ఏమంటారో అని మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ సారి ఫెయిల్ అయితే మరో ఛాన్స్ ఉంటుంది. అయితే మధ్య ప్రదేశ్‌లో ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అయ్యి కూడా తన పేరెంట్స్ తో ఒక్క మాట అనిపించుకోకుండా తప్పించుకుంది. తన అతి తెలివి చూసి పోలీసులే షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ యువతి తన కుటుంబంతో కలిసి నివాసముంటోంది. స్థానిక కాలేజీలో ఆమె బీఏ ఫస్ట్ ఇయర్ చదువుకుంటోంది. కాగా.. శుక్రవారం రాత్రి.. యువతి తండ్రి పోలీసుల వద్దకు వెళ్లాడు. తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశాడు. కాలేజీ నుంచి తిరిగొస్తుండగా.. నా కూతురును ఎవరో అపహరించినట్లు తెలిపాడు.
ఘటనపై తక్షణమే స్పందించారు పోలీసులు. యువతిని రక్షించేందుకు రంగంలోకి దిగారు. అధికారులు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు యువతి ఫొటోను పంపించారు. స్థానిక సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. శుక్రవారం రాత్రి సీసీటీవీ ఫుటేజ్ చూసి షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. యువతిని ఉజ్జెయిన్‌లోని ఓ రెస్టారెంట్లో గుర్తించినట్టు ఫోన్లో చెప్పారు. వెంటనే యువతిని ఇండోర్‌కు తీసుకొచ్చారు. తర్వాత విచారణలో సీసీటీవీ ఫుటేజ్ అంశాన్ని లేవనెత్తారు. తాను ఆటో ఎక్కినట్టు యువతి చెప్పిందని, కానీ సీసీటీవీ ఫుటేజ్‌లో అలాంటిదేమీ లేదని పోలీసులు ముందే గుర్తించి, ఆమెను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే యువతి అసలు విషయాన్ని బయటపెట్టింది.
“నేను బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. డిగ్రీ పరీక్ష ఫలితాలు శుక్రవారం వచ్చాయి. నేను ఫెయిల్ అయ్యాను. ఈ విషయం ఇంట్లో తెలిస్తే నన్ను తిడతారు, కొడతారు. నాకు భయం వేసింది. అందుకే కిడ్నాప్ అయినట్టు నేను చెప్పాను,” అని పోలీసుల వద్ద నిజం చెప్పేసింది ఆ యువతి. యువతి బ్యాగులో ఇండోర్ నుంచి ఉజ్జెయిన్ వెళ్లిన బస్సు టికెట్, రెస్టారెంట్ బిల్లును పోలీసులు పరిశీలించారు. అనంతరం ఓ మహిళా పోలీసు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి తప్పును మరోమారు రిపీట్ చేయవద్దని సూచించారు. అనంతరం యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.