ఆప్ ఎమ్మెల్యే మహేందర్ గోయల్ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇవాళ (బుధవారం) ఆయన అసెంబ్లీకి డబ్బులను తీసుకొని వచ్చారు. ఆ నగదు ఓ కాంట్రాక్టర్ ఇచ్చినవి కావడం విశేషం. అంబేద్కర్ ఆస్పత్రిలో తాత్కాలిక ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలు జరిగాయట. దీనిపై కాంట్రాక్టర్‌ను మహేందర్ గోయల్ నిలదీశారు. ఎమ్మెల్యే మహేందర్‌ను మచ్చిక చేసుకోవాలని ఆ కాంట్రాక్టర్ ప్రయత్నించాడు. ఇంటికి వచ్చి నగదును ముట్టజెప్పారు. కట్ చేస్తే.. ఇవాళ అసెంబ్లీకి అదే డబ్బుతో ఆయన వచ్చారు.
రోహిణిలోని బాబాసాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్లో తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవడంలో అవకతవకలు జరిగాయట. నిలదీసినందుకు ఎమ్మెల్యేకు నగదు అందజేశాడు సదరు కాంట్రాక్టర్. అతను ఇచ్చిన నగదును ఎమ్మెల్యే అసెంబ్లీలో చూపించారు. ఈ అంశంపై తాను ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే తెలిపారు. నిందితులు శక్తిమంతులని, తనను కామ్‌గా ఉంచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని గోయల్ ఆందోళన చెందారు. అయినప్పటికీ బెదిరింపులకు లొంగలేదని, ప్రైవేట్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
తనకు రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని స్పీకర్‌కు తెలిపారు. అయితే ఆధారాలను సమర్పించాలని ఎమ్మెల్యేకు మహేందర్‌కు స్పీకర్ సూచించారు. ఒకవేళ ఆధారాలు సమర్పిస్తే, భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని స్పీకర్ కోరే అవకాశం ఉంటుంది.