»Wings Of Plane Damaged By Hail Plane Lands 10 Minutes After Take Off
Plane Damaged : టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే వడగళ్లు.. దెబ్బతిన్న విమానం రెక్కలు!
విమానం టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. వడగళ్ల వాన దెబ్బకు 170 మందితో ప్రయాణిస్తున్న విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఏమయ్యిందంటే...?
Plane Damaged By Hail : ఇటీవల కాలంలో రకరకాల విమాన ప్రమాద ఘటనలను వార్తల్లో చూస్తూ ఉంటున్నాయి. అయితే ఒడిశాలో జరిగిన ఓ ఘటనతో అంతా భయాందోళనలకు గురయ్యారు. విస్తారా విమానం భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ నుంచి 170 మందితో టేకాఫ్ అయ్యింది. దిల్లీకి వెళ్లేందుకు అది గాల్లోకి లేచింది. పది నిమిషాల్లోనే అక్కడ అకస్మాత్తుగా దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. ఎక్కువ మొత్తంలో వడగళ్లు (Hail)పడ్డాయి.
దీంతో విస్తారా ఫ్లైట్ రెక్కలు దెబ్బతిన్నాయి. అది గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తం అయ్యారు. దిల్లీ వరకు వెళితే ప్రమాదం అని భావించి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి తిరిగి భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌కి దారి మళ్లించారు. దీంతో మరో పది నిమిషాల్లోనే ఆ విమానం తిరిగి విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. దీంతో అప్పటి వరకు ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని ఉన్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంలో పైలెట్ ముందు చూపుతో పని చేయడం వల్ల చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ సంచాలకుడు ప్రసన్న ప్రధాన్ తెలిపారు. పైలెట్ సమయస్ఫూర్తికి మెచ్చుకున్నారు. మరి కాసేపటి తర్వాత మరో విస్తారా విమానంలో ఆ ప్రయాణికులను ఢిల్లీకి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.