»Centre Steps In As Vistara Crisis Deepens With More Delays Cancellations
Vistara : ఆకస్మికంగా రద్దైన విస్తారా విమానాలు… ప్రశ్నించిన కేంద్రం
ప్రముఖ విమాన యాన సంస్థ విస్తారా ఉన్నట్లుండి తన సర్వీసుల్ని తగ్గించేసింది. కొన్ని ఫ్లైట్లను రద్దు చేసింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం ఇందుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Vistara Crisis : అంతర్జాతీయ సర్వీసుల నుంచి డొమస్టిక్ సర్వీసుల వరకు అన్ని ప్లైట్లను రన్ చేసే విమాన యాన సంస్థ విస్తారా. గత వారం రోజులుగా ఉన్నట్లుండి ఇది తన సర్వీసుల్ని తగ్గించివేసింది కొన్ని ఫ్లైట్లను రద్దు చేసింది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎలా ఎందుకు జరిగిందని కేంద్ర(Centre )ప్రభుత్వం ప్రశ్నించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని మంగళవారం నోటీసులు జారీ చేసింది.
చాలా వరకు పైలట్లు, ఫస్ట్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో తమ విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా తగ్గించినట్లు విస్తారా సోమవారం ప్రకటించింది. తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల ఇలా సర్వీసుల రద్దు (Cancellations), ఆలస్యం( Delays) చోటు చేసుకున్నాయని తెలిపింది. అయితే ఈ కారణం చూపి సంస్థ ఏకంగా 50 సర్వీసుల్ని రద్దు చేసింది. మంగళవారం ఆ సంఖ్య 70 వరకు ఉంటుందని తెలుస్తోంది.
ఇంతకీ ఇంత పెద్ద మొత్తంలో పైలెట్లు, ఫస్ట్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడానికి పెద్ద కారణాలే ఉన్నాయి. సింగపూర్ ఎయిర్ లైన్స్, టాటా గ్రూప్‌ల సంయుక్త సంస్థే విస్తారా(Vistara). అయితే తమ సంస్థ అయిన ఎయిర్ ఇండియాతో, విస్తారాను టాటా గ్రూప్ విలీనం చేస్తోంది. ఈ మార్పులో భాగంగా పైలెట్ల పరిహారం విషయంలోనూ కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది. దాని ప్రకారం పైలెట్లు ఇకపై 40 పని గంటలకు మాత్రమే స్థిర వేతనాన్ని పొందుతారు. గతంలో అది 70 గంటలుగా ఉండేది. దీని వల్ల తమ ప్యాకేజీలో కోత పడుతుందని ఫస్ట్ ఆఫీసర్లు, పైలెట్లు భావిస్తున్నారు. సీనియారిటీ విషయంలోనూ ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. అయితే ఈ విషయంలో సంస్థ వారికి హామీ ఇచ్చినా వారిలో సందేహాలు ఉన్నాయి. మార్చి 15లోగా ఒప్పందాలపై పైలెట్లు, ఫస్ట్ ఆఫీసర్లు సంతకాలు చేయాలని సంస్థ చెప్పింది. దీంతో అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు పలు ఆరోగ్య కారణాలు చూపి సెలవులు పెట్టారు. దీంతో ఆ ప్రభావం ఇప్పుడు విమాన సర్వీసుల రద్దు వరకూ వెళ్లింది.