నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్, ‘ఆప్’ నిర్ణయించినట్టు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు తెలిపారు. ఢిల్లీలో నిన్న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ దారుణంగా విఫలమైందని, ఇందుకు నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని తమ రెండు పార్టీలు నిర్ణయించినట్టు తెలిపారు. బహిష్కరణకు గల కారణాన్ని నేటి మధ్యాహ్నం విజయ్ చౌక్ వద్ద వెల్లడిస్తామన్నారు.
అఖిలపక్ష సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అలాగే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై కేశవరావు తీవ్ర విమర్శలు చేశారు. ఆమె కావాలనే రాజ్యాంగపరమైన సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. బడ్జెట్‌ను ఆమోదించకపోవడం అంటే ప్రభుత్వం నడవకుండా అడ్డుకోవడమేనని అన్నారు. బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, తెలంగాణపై కుట్రలను ఈ సమావేశాల్లో ఎండగడతామని అన్నారు.