Vande Bharat : మన దేశంలో వందే భారత్ రైలు సేవలు వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే ఎక్కువ దూరాలను తొందరగా చేరుకోగలుగుతున్నాం. అయితే ఇప్పటి వరకు ఈ రైళ్లలో కార్ ఛైర్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు వీటిలో స్లీపర్ క్లాస్‌ని కూడా తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రయాణికులకు తద్వారా మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు చూస్తోంది. ఇందుకు సంబంధించిన రైలు ట్రయిల్ రన్‌ను(Trial Run) ఆగస్టు 15 నుంచి ప్రారంభించనుంది. దిల్లీ, ముంబయిల మధ్య ఈ ట్రయిన్ ట్రయిల్ రన్ జరుగుతుందని తెలుస్తోంది.
కొత్తగా రానున్న ఈ స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లు(Vande Bharat Train) 16 బోగీలతో ఉండనున్నాయి. ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లు వేరుగా ఉంటాయి. 16 కోచ్‌ల్లో పది కోచ్‌లు థర్డ్ ఏసీవే ఉంటాయని తెలుస్తోంది. నాలుగు సెకెండ్ ఏసీ, ఒకటి ఫస్ట్ ఏసీ ఉంటాయి. ఆ ప్రకారం టికెట్ ధరల్లో సైతం వ్యత్యాసం ఉంటుంది. బెంగళూరులోని రైళ్ల తయారీ కేంద్రంలో ప్రస్తుతం ఈ రైలు తుది మెరుగులు దిద్దుకుంటోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ పలు రూట్లలో వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాక పలు రూట్లలో ఇవి తిరిగే అవకాశాలు ఉన్నాయి. సికింద్రాబాద్-పూణె, కాచిగూడ-విశాఖపట్నం, కాచిగూడ-తిరుపతి తదితర మార్గాల్లో ఈ స్లీపర్ రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు డిమాండ్ చేస్తున్నారు.