రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం మొదలు పెట్టారు. ఆ వెంటనే ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Opposition walks out : రాజ్య సభలో మోదీ ప్రసంగం మొదలు పెట్టీ పెట్టడంతోనే విపక్షాలు ఆందోళన మొదలు పెట్టాయి. అసహనం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశాయి. బుధవారం రాజ్యసభలో మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం ప్రారంభించారు. అయితే ఆయన ప్రసంగంపై విపక్షాలు(Opposition) అభ్యంతరం వ్యక్తం చేశాయి. చివరికి వాకౌట్ చేశాయి. ఈ తీరుపై సభ ఛైర్మన్, ప్రధాని మోదీలు( PM Modi) సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇలా వాకౌట్ చేయడంపై ప్రధాని మోదీ( PM Modi) సైతం ఘాటుగా స్పందించారు. ‘విపక్ష నేతలు సభను విడిచి వెళ్లలేదు. మర్యాదను విడిచి వెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా అవమానిస్తున్నారు. ప్రతి ఒక్క సభ్యుడికీ సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నాం. అయినప్పటికీ వారు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం లేదు. ఇలా రాజ్యాంగాన్ని హేళన చేస్తూ ప్రవర్తించడం సరైనది కాదు. రాజ్యాంగం కేవలం చేతిలో పుస్తకం కాదు. అది జీవితాలకు మార్గదర్శకం చేసే గొప్ప విషయం’ అంటూ ఆయన చెప్పారు.
అనంతరం ఆయన తన ప్రసంగాన్ని యధాతథంగా కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. దాదాపుగా భారత ప్రజాస్వామ్య చరిత్రలో 60 ఏళ్ల తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. దేశాన్ని ఆర్థిక వృద్ధి విషయంలో పదో స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకు వచ్చామని చెప్పారు. సేవా భావంతో మాత్రమే ఎన్డీయే కూటమి ముందుకు వెళుతోందని అన్నారు. అందుకనే ప్రజలు తమను మరోసారి ఆశీర్వదించారని చెప్పారు. అయితే ఈ విషయం కొందరికి అసంతృప్తిని మిగిల్చిందని అన్నారు.