స్లీపర్ కోచ్‌లతో కూడిన కొత్త వందే భారత్ రైళ్లు మరికొన్ని రోజుల్లోనే దేశంలో తిరగనున్నాయి. అందుకు సంబంధించిన స్లీపర్ కోచ్ కాన్సెప్ట్ చిత్రాలను కేంద్ర కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే అవి ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
Vande Bharat Train Sleeper Coach concept pics Features
భారతీయ రైల్వేలు ఎట్టకేలకు వందే భారత్ స్లీపర్ కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..వందే భారత్ స్లీపర్ కాన్సెప్ట్(Sleeper Coach concept) రైలు కోచ్‌ల చిత్రాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ కొత్త రైళ్లు మార్చి 2024 నాటికి అందుబాటులోకి వస్తాయని, ప్రయాణీకులకు వేగవంతమైన, అత్యాధునిక సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఇక మంత్రి రిలీజ్ చేసిన చిత్రాల్లో వందే భారత్ స్లీపర్ కోచ్‌లు విశాలమైన బెర్త్‌లు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఇంటీరియర్స్, విశాలమైన టాయిలెట్లు, మినీ ప్యాంట్రీ, ఆధునాతన భద్రతా ఫీచర్లతో కూడిన అనేక సౌకర్యాలు ఉన్నాయి. కొత్త రైళ్లు ప్రస్తుత కోచ్‌ల కంటే ఎక్కువ ఇంధన సమర్థవంతమైనవి. దీంతోపాటు పర్యావరణ అనుకూలమైనవిగా ఉంటాయి. వందే భారత్ స్లీపర్ కోచ్‌లను ప్రవేశపెట్టడం భారతీయ రైల్వేలకు ఒక మచి పరిణామం. ఎందుకంటే ఇది ప్రయాణీకులు రాత్రిపూట హై-స్పీడ్ రైళ్లలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఇది రైలు ప్రయాణాన్ని ప్రయాణికులకు మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని రైల్వేల ఆదాయాన్ని మరింత పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అత్యాధునిక ఫీచర్లతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. న్యూఢిల్లీ, వారణాసి మధ్య మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఫిబ్రవరి 15, 2019న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేయబడిన ఈ రైలు సెట్ ‘మేక్-ఇన్-ఇండియా’ చొరవకు చిహ్నంగా నిలుస్తుంది. భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించి తక్కువ ధరలోనే ఈ ట్రైన్స్ తయారు చేయడం విశేషం.