Tsunami: జపాన్‌లో వరుస భూకంపాలు ఆ దేశ ప్రజలను వణికిస్తున్నాయి. ఇటీవల రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. భూమి ఏకంగా 18గంటల్లో 155సార్లు కంపించింది. జపాన్‌లో భూకంపం నేపథ్యంలో భారత్‌కు సునామీ ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS)కి చెందిన ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ (ITEWC) తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్‌కు సునామీ ముప్పు లేదని స్పష్టం చేశారు. పసిఫిక్ మహాసముద్రం సునామీ హెచ్చరిక కేంద్రం (PTWC), జపాన్ వాతావరణ సంస్థ (JMA) జపాన్‌కు సునామీ హెచ్చరిక జారీ చేసింది.
జపాన్ మధ్య ప్రాంతంలో సంభవించిన శక్తివంతమైన భూకంపాల కారణంగా పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. జపాన్ పశ్చిమ తీరంలో ఇషికావా, ఫుకుయ్, నీగాటా, తోయామా, యమగటా, ఇతర ప్రిఫెక్చర్లతో సహా అనేక ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్‌తో పాటు రష్యాకు కూడా సునామీ ప్రమాద ఘంటికలు మోగించింది. కానీ భారత్‌కు ఎలాంటి సునామీ ముప్పు లేదని వివరించింది. భారతదేశాన్ని చివరిసారిగా డిసెంబర్ 26, 2004న సునామీ తాకింది. సముద్రగర్భంలో సంభవించిన భూకంపం కారణంగా 14 దేశాలు ప్రభావితమయ్యాయి. భారత్, శ్రీలంక, మాల్దీవులు తదితర దేశాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS)లో అక్టోబర్ 2007లో ITEWCని స్థాపించింది.