SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మంగళవారం ఎలక్టోరల్ బాండ్ల పూర్తి డేటాను ఎన్నికల కమిషన్కు పంపింది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు గడువును పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. అలాగే మార్చి 12వ తేదీ నాటికి ఎస్బీఐ పనివేళలు ముగిసేలోగా ఎన్నికల కమిషన్కు ఎలక్టోరల్ బాండ్ల గురించిన పూర్తి సమాచారాన్ని అందించాలని కోర్టు ఆదేశించింది. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు పూర్తి డేటాను ఎన్నికల కమిషన్కు ఎస్బీఐ పంపింది.
సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మార్చి 15 సాయంత్రం 5 గంటలలోపు ఎస్బీఐ తన అధికారిక వెబ్సైట్లో పంచుకున్న సమాచారాన్ని ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇప్పుడు SBI డేటాను పంపిన తర్వాత, ఎన్నికల కమిషన్ దానిని మార్చి 15 లోపు తన వెబ్సైట్లో ప్రచురించాలి. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా హాజరయ్యారు. బ్యాంక్ తన ఆదేశాలు, సమయపాలనలను పాటించడంలో విఫలమైతే, ఫిబ్రవరి 15 నాటి తీర్పును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు సుప్రీం కోర్టు దానిపై చర్య తీసుకోవచ్చని బెంచ్ ఎస్బిఐకి నోటీసు జారీ చేసింది.