»Rbi Warning To Banks If Not Done Within 30 Days Heavy Fine
RBI: బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్..30 రోజుల్లోపు అలా చేయకుంటే భారీ జరిమానా!
రుణాలు చెల్లించిన వారి పత్రాలను కొన్ని బ్యాంకులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తుంటాయి. దీనిపై ఆర్బీఐకి పలు ఫిర్యాదులు అందడంతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ రూల్స్ జనవరి 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయి.
బ్యాంకులకు (Banks) ఆర్బీఐ (RBI) వార్నింగ్ ఇచ్చింది. హోమ్ లోన్ (Home Loan)కు సంబంధించి పూర్తి రుణాన్ని తిరిగి చెల్లించినట్లైతే వారికి 30 రోజుల్లో అన్ని ఒరిజినల్ పత్రాలను ఇవ్వాలని ఆదేశించింది. కస్టమర్లకు అన్ని పత్రాలు ఇవ్వకపోతే జరిమానా విధించనున్నట్లు ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చింది. ఒక వేళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వడంలో జాప్యం జరిగితే రోజుకు రూ.5 వేలు బ్యాంకులకు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది.
రుణం (Loans) తీసుకున్న వారి ఆస్తి పత్రాలను విడుదల చేయడంలో జాప్యం జరిగితే, బ్యాంక్స్ రెగ్యులేటరీ అథారిటీ దానికి కారణాన్ని అడుగుతుందని, జాప్యానికి గల కారణాల గురించి రుణగ్రహీతకు తెలియజేస్తుందని వెల్లడించింది. రుణం ఇచ్చే బ్యాంకు ఆలస్యానికి బాధ్యత వహిస్తే ఆలస్యానికి రోజుకు 5,000 జరిమానా విధిస్తామని, అలాగే రుణగ్రహీతకు పరిహారం చెల్లిస్తామని కూడా ఆర్బీఐ (RBI) ఓ సర్క్యూలర్ విడుదల చేసింది.
ఈమధ్య కాలంలో కస్టమర్లను బ్యాంకులు వేధిస్తున్నాయని ఆర్బీఐకి పలు ఫిర్యాదులు అందాయి. అందులో ముఖ్యంగా లోన్ పూర్తి అయిన తర్వాత కూడా తమ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని పలువురు ఆర్బీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంది. ఆగస్టు 18వ తేదిన లోన్ ఖాతాలపై బ్యాంకులు జరిమానాను విధించే ప్రక్రియపై కొత్త మార్గదర్శకాలను (New Rules) విడుదల చేసింది. ఇకపోతే ఇప్పుడు తీసుకొచ్చిన కొన్ని కొత్త మార్గదర్శకాలు జనవరి 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయి.