Lok Sabha Elections 2024: అలా చేస్తే ఖర్చు నాదే.. దేశంలోని పార్టీలకు కేసీఆర్ భారీ ఆఫర్?
బీజేపీ లేదా నరేంద్ర మోడీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ గా చేస్తే వచ్చే లోకసభ ఎన్నికల్లో ఖర్చు మొత్తం తానే భరిస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
వచ్చే లోకసభ ఎన్నికల్లో (Lok Sabha elections 2024) దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలకు అయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తానని, ఇందుకు ప్రతిగా తనను బీజేపీ వ్యతిరేక విపక్ష కూటమికి (Non BJP alliance) చైర్మన్ గా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), బీఆర్ఎస్ అధినేత (BRS chief) కేసీఆర్ (K Chandrasekhar Rao) చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ (journalist rajdeep sardesai) బయట పెట్టిన వీడియో ద్వారా ఇది వెల్లడవుతోంది. కేసీఆర్ ఆఫర్ రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. ఉద్యమం సమయంలో డబ్బులు లేని వారు ఇప్పుడు యావత్ దేశానికి లోకసభ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసే పరిస్థితికి ఎలా ఎదిగారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎనిమిదేళ్లలో ఎంత అవినీతి చేస్తే అంత ఖర్చు పెట్టగలరని విపక్షాలు నిలదీస్తున్నాయి. రాజ్ దీప్ సర్దేశాయ్ వీక్లీ బ్లాగ్, అలాగే మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం… 2024 లోకసభ ఎన్నికలు మోడీ వర్సెస్ విపక్షాలుగా (Modi versus all parties) ఉంటుంది.
ఇప్పటికే దేశంలోనే ధనిక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది బీఆర్ఎస్ (BRS). టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా (BRS Party) మార్చిన కేసీఆర్, వరుసగా వివిధ రాష్ట్రాల్లో టూర్ లకు సిద్ధమయ్యారని, వచ్చే ఎన్నికల్లో ప్రచారం కోసం దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక కూటమి పక్షాలకు తాను డబ్బులు ఖర్చు చేస్తానని, మోడీ సహచర నేతలతో ఓ ప్రయివేటు భేటీలో చెప్పారని రాజ్ దీప్ తన వీడియోలో పేర్కొన్నారు. అయితే ఇందుకు ఆయన ఓ కండిషన్ పెట్టారని, విపక్షాల కూటమికి తనను చైర్మన్ గా చేయాలని చెబుతున్నారని, కానీ మిగతా పార్టీలు అంగీకరిస్తాయా చూడాలని రాజ్ దీప్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీ వ్యతిరేక కూటమి కోసం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కేసీఆర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మమత, నితీష్, కుమారస్వామి, కేజ్రీవాల్ వంటి వారితో కేసీఆర్ చర్చించారు.
బీజేపీ వ్యతిరేక కూటమి ఎన్నికల ఖర్చును మొత్తం తానే భరిస్తానని కేసీఆర్ చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ, ఆయన స్వయంగా ఇంకా చెప్పలేదు. బాహాటంగా చెబితే అప్పుడు అవినీతి విషయం మరింతగా వెళ్తుందని అంటున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలకు ఫండింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు రాజ్ దీప్ సర్దేశాయ్ వీడియో మరింత కలకలం రేపుతోంది.