అందరూ ఉత్సాహంగా ఉన్నారు. పెళ్లి ఇల్లు (Marriage) బంధుమిత్రులతో కళకళలాడుతోంది. తెల్లారే పెళ్లి కావడంతో ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. కొద్దిసేపట్లో బరాత్ (Barat) ప్రారంభం కావాల్సి ఉంది. అంతలోపే పెను విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలి విస్ఫోటనం జరిగింది. పేలుడు ధాటికి ఇల్లు కూలిపోగా.. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఏకంగా 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్ (Rajasthan)లోని జోధ్ పూర్ (Jodhpur)లో చోటుచేసుకుంది.
భుంగ్రా (Bhungra) అనే గ్రామంలో ఓ ఇంట్లో పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం పెళ్లికి ముందు నిర్వహించే బరాత్ కు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో స్టోర్ రూమ్ లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీకవుతోంది. దాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో కొద్దిసేపటికి ఒక్కసారిగా భారీ శబ్ధంతో సిలిండర్ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఇల్లంతా కూలిపోయింది. పెళ్లి కోసం వచ్చిన బంధుమిత్రులు ఎగిరి పడ్డారు. మంటలు చెలరేగడంతో ఏకంగా 7 మంది మృతి చెందారు. 60 మందికి పై గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టింది. క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ (Ashok Gehlot), కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, నాగౌర్ ఎంపీ హనిమాన్ బెనివాల్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ హిమాన్షు గుప్తా పరిశీలించారు. ‘ఇది ఘోర సంఘటన. 60 మంది గాయపడ్డారు. వారిలో 42 మందిని ఎంజీఎం ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. వైద్య సదుపాయం అందిస్తున్నాం’ అని కలెక్టర్ తెలిపారు.