లోక్‌సభ(Lok Sabha)కు ముందస్తు ఎన్నికలు జరుగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ (CM Nitishkumar) తెలిపారు. పాట్నాలోని తన నివాసంలో ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాదే జరుగాల్సిన అవసరం లేదని, గడువుకన్నా ముందే జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రలలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరుగనున్న నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్(December)నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్య జరిగే అవకాశాలున్నాయని ఇటీవల పలువురు పరిశీలకులు కూడా పేర్కొనటం ముందస్తుపై ఊహాగానాలకు ఆస్కారమిస్తున్నది.
లోక్‌సభకు ఈ ఏడాదే ఎన్నికలు జరుగుతాయా..? కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తోందా..? ఈ విషయంలో రాజకీయ పార్టీలు ఒక అంచనాకు వచ్చాయా..? నిజానికి రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరపాలని బీజేపీ (BJP)ఎప్పటినుంచో భావిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే అనేకసార్లు పలు పార్టీలతో చర్చలు కూడా జరిపింది. దీనివల్ల ఆర్థికంగా నిధులూ మిగులుతాయని, సమయం ఆదా అవుతుందని, కేంద్రం, రాష్ట్రాలు.. రెండింటికీ ప్రయోజనం ఉంటుందని బీజేపీ ఆలోచన. దీని వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వేర్వేరు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్ని కూడా నిర్ణయించగలవు. ఏదైనా రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ కొనసాగుతుంది.
అందుకే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రాష్ట్రాలకు, కేంద్రానికి కలిపి ఒకేసారి జమిలి ఎన్నికలు (Jamili elections)నిర్వహించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయం వల్ల తమకే ప్రయోజనం ఉంటుందని బీజేపీ ఆశ. వచ్చే ఏడాది మార్చిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యుల్ ప్రకారం డిసెంబర్‌లోపు తెలంగాణ(Telangana), ఛత్తీస్ గఢ్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్, మిజోరం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఆరు నెలల్లోనే లోక్ సభ ఎన్నికలతో పాటు మరో 4 రాష్ట్రాల ఎన్నికలు జరగాలి. అంటే ఆరు నెలల్లోనే పార్లమెంట్ తో పాటు తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. అందులో ఐదు రాష్ట్రాలకు ముందుగా జరుగుతాయి. అయితే ఇప్పుడు ఇలా ఎందుకు అన్నింటినీ ఒకే సారి పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కేంద్రం ఉందని అంటున్నారు. మహారాష్ట్ర(Maharashtra)లో రాజకీయ పరిస్థితులు తేడాగా ఉన్నాయి. ఆ రాష్ట్రం ఎన్నికలు కూడా ఒకే సారి పెట్టేస్తే పనైపోతుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.