»Odisha Iron Rod Stuck In Boy Body And Mkcg Doctors Successfully Removed
Odisha బాలుడి వెనుక భాగంలో దిగిన గడ్డపార.. అతికష్టమ్మీద తొలగింపు
గతంలో ఇదే ఆస్పత్రి వైద్యులు ఒక వ్యక్తి శరీరంలో ఉన్న స్టీల్ గ్లాస్ తొలగించారు. అత్యంత అరుదైన శస్త్ర చికిత్సలు ఈ ఆస్పత్రి వైద్యులు చేసి ప్రశంసలు అందుకుంటున్నారు.
ప్రమాదవశాత్తు ఓ బాలుడి (Boy) శరీరంలోకి గడ్డపార (Crowbar) దిగింది. ఏకంగా మలద్వారంలోకి గునపం చొచ్చుకుపోయింది. ప్రభుత్వ పాఠశాలపై రేకులు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఆ సమయంలో ఓ కూలీ గడ్డపారతో పనులు చేస్తుండగా.. కిందపడిపోయిన బాలుడు నేరుగా గడ్డపారపై పడ్డాడు. ఫలితంగా బాలుడి మలద్వారంలోకి గునపం దిగిపోయింది. బాలుడు అల్లాడిపోగా.. వెంటనే కూలీలు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి (Hospital) తరలించారు. నాలుగు గంటల పాటు శ్రమించిన వైద్యులు (Doctors) విజయవంతంగా గునపం తొలగించారు. బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ సంఘటన ఒడిశాలో (Odisha) చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒడిశాలోని కొందమాల్ జిల్లా (Kandhamal District) కోటగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సువర్ణగిరి ప్రాంతానికి చెందిన సనాతన పటగురు కుమారుడు శక్తి పటగురు (16) (Shakti Pataguru). చదువుకోకుండా తండ్రితో పాటు హమాలీ పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల (Govt School) అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ పాఠశాలకు శనివారం వెళ్లి తరగతి గదులపైకి ఎక్కి రేకులు తొలగిస్తున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు. ఓ కూలీ గునపంతో పని చేస్తుండగా.. ఆ గునపంపైనే బాలుడు పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఐదు అడుగులు ఉన్న గడ్డపార రెండు అడుగులు బాలుడి మలద్వారంలోకి చొచ్చుకెళ్లడంతో విలవిలలాడాడు.
కుటుంబసభ్యులు వెంటనే బలిగుడ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఎంకేసీజీ ప్రభుత్వ ఆస్పత్రిలో (MKCG Hospital) చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం రాత్రి 8 నుంచి 12 గంటలకు శ్రమించి శస్త్ర చికిత్స చేశారు. మలద్వారం నుంచి గునపాన్ని విజయవంతంగా తొలగించారు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని.. కోలుకుంటున్నాడని ఆస్పత్రి అధికారి గోపాల్ తెలిపారు. కాగా తమ బిడ్డను కాపాడిన వైద్యులకు బాలుడి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. కాగా గతంలో ఇదే ఆస్పత్రి వైద్యులు ఒక వ్యక్తి శరీరంలో ఉన్న స్టీల్ గ్లాస్ తొలగించారు. అత్యంత అరుదైన శస్త్ర చికిత్సలు ఈ ఆస్పత్రి వైద్యులు చేసి ప్రశంసలు అందుకుంటున్నారు.