రాష్ట్రపతికి పార్లమెంట్‌ను ప్రారంభించే అవకాశం ఇవ్వలేదని ఓవైపు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ.. కేంద్ర సర్కారు అవేవీ పట్టించుకోకుండా ప్రధాని నరేంద్రమోదీ (PM MODI) చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ముహుర్తం ఖరారు చేసింది. ఆధునిక హంగులు, అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన కొత్త పార్లమెంట్ (New Parliament) భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 28వ తేదీన ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా న్యూ పార్లమెంట్ ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. 1.48 నిమిషాల నిడివి గల వీడియోలో కొత్త పార్లమెంట్ భవనాన్ని చూపించారు.
ప్రధాన ద్వారం నుండి లోపలకి ప్రవేశిస్తూ.. ప్రారంభం అవుతుంది ఈ ఫస్ట్ లుక్ వీడియో. పార్లమెంట్ భవనం లోపలి, బయటి దృశ్యాలను చిత్రీకరించారు. లోక్ సభ(Lok Sabha), రాజ్యసభ.. ఈ రెండు సభల్లో సభ్యుల సీటింగ్ అమరికను చూపించారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పార్లమెంట్ నాలుగు అంతస్తులతో ఉంటుంది. మొత్తం 1,224 మంది ఎంపీలు కూర్చునే అవకాశం ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటికి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అని పేర్లు పెట్టారు. ఇందులో పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు కమిటీ గదులు కూడా ఎన్నో హంగులతో రూపుదిద్దుకున్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో మహాత్మా గాంధీ(Mahatma Gandhi), జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ తో పాటుగా దేశంలో ప్రధాన మంత్రులుగా చేసిన వారి ఫొటోలను పొందుపరచనున్నారు.