ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ (Himachal), ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్, రాజస్థాన్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఉత్తరాఖండ్(Uttarakhand), హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వంతెనలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఢిల్లీ(Delhi)లో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఢిల్లీ ఎన్సీఆర్లో 33 గంటల్లో 258.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో ఢిల్లీలో స్కూల్స్ మూసివేశారు.హిమాచల్ ప్రదేశ్లో వరద బీభత్సం కొనసాగుతోంది.
భారీ వర్షాలతో కొండచరియలు (Landslides) విరిగిపడి..బురదతో కూడిన వరద ప్రవాహం జనావాసాల్లో బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల కారణంగా మండిలో క్షణాల్లో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయిన దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు (Heavy rains) హిమాచల్ ప్రదేశ్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, ఊహించని వరదలు (floods) ముంచెత్తుతున్నాయి. రోడ్లు, వాహనాలు, ఇండ్లు వరద ధాటికి కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందారు. మండి ప్రాంతంలో క్షణాల్లో రోడ్డుకొట్టుకు పోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ (video viral) అవుతోంది.ఈ వీడియోలో బురదతో కూడిన వరద ప్రవాహం ఇండ్లు, రోడ్లను ఎలా ముంచెత్తిందో స్పష్టంగా కనిపిస్తోంది. భయంలో జనం పెద్దగా అరుస్తున్న శబ్దాలు ఈ వీడియోలో వినిపిస్తున్నాయి.