భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో ఆదిత్య ఎల్1ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. సూర్యునిపై పరిశోధనల కోసం ఈ మిషన్ను చేపట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించి ఇస్రో శనివారం కీలక అప్డేట్ అందించింది. ఈ వ్యౌమనౌక ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించిందని వెల్లడించింది. భూ గురుత్వాకర్షణ పరిధిని కూడా దాటి విజయవంతంగా దూసుకెళ్తోందని తెలిపింది.
ఆదిత్య ఎల్1 మిషన్పై ఇస్రో చేసిన ట్వీట్:
Aditya-L1 Mission:
🔸The spacecraft has travelled beyond a distance of 9.2 lakh kilometres from Earth, successfully escaping the sphere of Earth's influence. It is now navigating its path towards the Sun-Earth Lagrange Point 1 (L1).
ప్రస్తుతం లెగ్రేంజ్ పాయింట్1 దిశగా ఆదిత్య ఎల్1 పయనిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ఎల్1 పాయింట్ అనేది సూర్యుని దిశగా చూస్తే దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూ గురుత్వాకర్షణ పరిధిని దాటి ఓ వ్యౌమనౌకను ఇస్రో విజయవంతంగా పంపడం ఇది రెండోసారి కావడం విశేషం. సెప్టెంబర్ 2వ తేదిన ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే.
దశల వారీగా ఆదిత్య ఎల్1 మిషన్లో అన్ బోర్డ్ ఇంజన్లను మండించి ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్యను మార్చారని, అయితే అనుకున్న వేగం సాధించిన తర్వాత ఎల్1 పాయింట్ వద్దకు ప్రయాణిస్తుందని ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం ద్వారా సూర్యుని రహస్యాలను సులభంగా భారత్ తెలుసుకుని మరిన్ని ప్రయోగాలు చేయనుంది.