కర్నాటకలో (Karnataka) ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారుణుల (Civil Servants) మధ్య రాజుకున్న వివాదం మరింత ముదిరింది. బుధవారం రూప మాడ్గిల్ (IPS officer D. Roopa Moudgil) తన పర్సనల్ ఫోటోలతో పోస్టులు పెట్టడంతో రోహిణి సింధూరి (IAS officer Rohini Sindhuri) తీవ్రంగా పరిగణించారు. తనకు 24 గంటల్లో రాతపూర్వక క్షమాపణ (unconditional apology) చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, తనపై చేసిన అవాస్తవ వ్యాఖ్యలకు గాను (defamatory comments) తనకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని లీగల్ నోటీసులు పంపించారు. తనపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు రోహిణి.
తన క్లయింట్ (Rohini Sindhuri) ప్రస్తుత హోదాలో తన విధులను నిర్వహిస్తున్న సమయంలో ఫిబ్రవరి 18, 2023న ఫేస్ బుక్ పోస్ట్ చూసింది. ఇది యాదృచ్ఛికంగా ఆ ఫేస్ బుక్ పేజీ డీ రూపా మాడ్గిల్ (Roopa Moudgil) పేరుతో ఉంది. ఇందులో తమ క్లయింట్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. మీరు చేసిన వ్యాఖ్యలు/ప్రకటనలు/ఆరోపణలు నా క్లయింట్, ఆమె కుటుంబ సభ్యులను ఎంతో మానసిక వేదనకు గురి చేశాయి. వృత్తి పరంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా ఆమె ప్రతిష్టను దెబ్బతీశాయి. దీంతో ఆమె నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆమె నిజాయితీ, ప్రవర్తన చర్చనీయాంశంగా మారాయి. నా క్లయింట్ పేరు, ప్రతిష్టలకు జరిగిన నష్టాన్ని కరెన్సీ రూపంలో కొలవలేం. అయిన కానీ దీనిని కోటి రూపాయలకు పరిమితం చేస్తున్నాం. నష్ట పరిహారం కింద ఈ మొత్తాన్ని మీరు నా క్లయింట్ కు చెల్లించాలి అని రూపకు పంపిన నోటీసులో పేర్కొన్నారు.
మహిళా ఆఫీసర్ల మధ్య వాగ్యుద్ధం
కర్ణాటక హస్త కళల అభివృద్ధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు రూప. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ గా ఉన్నారు రోహిణి సిందూరి. గతంలో జేడీఎస్ ఎమ్మెల్యే మహేష్ తో ఒక రెస్టారెంటులో సింధూరి దిగిన ఫోటో వైరల్ గా మారింది. ఒక ఏఐఎశ్ అధికారిణి… రాజకీయ నాయకుడిని ఎందుకు కలిశారని రూప అప్పుడు ప్రశ్నించారు. ఇది ఇద్దరి మధ్య విబేధాలకు దారి తీసింది. ఆ తర్వాత వారి మధ్య వివాదం పెరిగింది. తాజాగా… ఆదివారం రోహిణి ఫోటోలను రూప సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఐఏఎస్ రోహిణి (IAS Rohini)కి చెందిన ఫోటోలను ఐపీఎస్ అధికారిణి రూప (IPS Roopa) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను గతంలోనే రోహిణి పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేశారని ఆరోపించారు. తద్వారా వృత్తి పరమైన నియమాలను ఉల్లంఘించారన్నారు. 2021 నుండి 2022 మధ్య వీటిని షేర్ చేసినట్లు చెప్పారు. అలాగే, అవినీతి ఆరోపణలు చేస్తూ… ముఖ్యమంత్రి బసవరాజ్కు, ప్రధాన కార్యదర్శి వందిత శర్మకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రూప చేసిన ఆరోపణలపై రోహిణి తీవ్రంగా స్పందించారు. తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని, తన పరువుకు భంగం కలిగించేందుకు తన సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్ స్క్రీన్ షాట్లను సేకరించారని మండిపడ్డారు. నేను కొంతమందికి ఈ ఫోటోలు పంపినట్లు ఆరోపిస్తున్నారని, ఆ పేర్లు చెప్పాలని డిమాండ్ చేసారు. మనిషికి మానసిక ఆరోగ్యం చాలా పెద్ద సమస్య అని, డాక్టర్ల సహకారంతో దానిని తగ్గించాల్సి ఉంటుందన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వారు అనారోగ్యానికి గురైతే ఎంతో ప్రమాదకరం అన్నారు. రూప పైన తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.
ఇద్దరు అధికారిణులు ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరు సామాన్యులు కూడా బహిరంగంగా ఇలా విమర్శలు చేసుకోరని, వ్యక్తిగత వైరం ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, కానీ ఇలా మీడియాకు ఎక్కడం ఏమిటని కర్నాటక హోంమంత్రి అన్నారు. సీఎం, పోలీస్ చీఫ్ తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని అప్పుడు చెప్పారు. ఆ తర్వాత వారిని బదలీ చేశారు. అయినప్పటికీ ఇరువురి మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో బహిరంగ ఆరోపణలు వద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మ కూడా ఇప్పటికే ఆదేశించారు. అయినప్పటికీ రూప బుధవారం మరో పోస్ట్ పెట్టారు.
మరోసారి.. బుధవారం ఫేస్ బుక్ లో రూపా ఓ పోస్ట్ పెట్టారు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నానని చెప్పారు. కనీసం.. జాగ్రత్త పడకపోవడంతోనే తమిళనాడులో ఓ ఐపీఎస్ అధికారి, కర్నాటకలో ఒక ఐఏఎస్, మరో అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. ఓ ఐఏఎస్ అధికారుల జంట విడాకులు తీసుకునే వరకు వెళ్లిందని, అందుకే నేను జాగ్రత్త పడుతున్నానని తెలిపారు. నేను, నా భర్త ఇప్పటికీ కలిసే ఉన్నామని, కుటుంబం విచ్ఛిన్నం కాకుండా పోరాటం చేస్తున్నానని, పలువురి జీవితాలు నాశనమయ్యేందుకు కారణమైన మహిళను నిలదీయక తప్పదన్నారు. భారత్ అంటే కుటుంబ విలువలకు పెద్ద పీట ఉంటుందని, ప్రజా జీవితాలను ప్రభావితం చేసే అవినీతిపై చేసే పోరుకు అందరు కలిసి రావాలన్నారు. అయితే అందులో ఎవరి పేరును ప్రస్తావించలేదు.