Karnataka: కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని పార్టీలన్నీ కసిమీద ఉన్నాయి. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో వ్యూహాలను పదునుపెడుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్ రానుంది. మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. అధికార బీజేపీ ఇవాళ తొలి జాబితా రిలీజ్ చేయనుంది.
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా.. బీజేపీ నేడు 120 నుంచి 150 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుందని తెలిసింది. కర్ణాటకలోనే ఉన్న ప్రధాని మోదీ ఆదివారం ఆయన అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జాబితాని ఖరారు చేసినట్లు తెలిసింది. ఐతే.. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జ్యోషి, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. ఇవాళ్టి జాబితా రిలీజ్‌తో.. కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం.
కర్ణాటక ప్రజలు ఐదేళ్లకోమారు ప్రభుత్వాన్ని మార్చేస్తుంటారు. అందువల్ల ఈసారి తాము ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ నాయకత్వం ధీమాతో ఉంది. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. మరోవైపు జేడీఎస్ తిరిగి పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్‌తోపాటూ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ ప్రచారం చేస్తారని సమాచారం.