Joe Biden: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గాజాకు మానవతా సాయం అందించనున్నారు. దీనిలో భాగంగా ముందు ఆహార పదార్థాలు అందించునన్నట్లు సమాచారం. కరవు, ఆహారం కొరత వంటి పరిస్థితులలో ఉత్తర గాజాలో సహాయం చేస్తున్న సమయంలో అలజడి రేగింది. తోపులాటలో కనీసం 115 మంది పాలస్తీనియన్లు మరణించారు. మరో 750 మందికి గాయాలయ్యాయి. ఈ పరిస్థితుల నడుమ తమకు సహాయం చేసేందుకు బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
విమానాల ద్వారా ఆహార ప్యాకెట్లను గాజాలోకి జారవిడుస్తామని అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. సముద్ర మార్గాన పెద్ద మొత్తంలో సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ‘రెడీ టూ మీల్స్’ ప్యాకెట్లను మిలటరీ విమానాల ద్వారా ఎయిర్‌డ్రాప్ చేయనుంది. ఈ ఆహార పంపిణీ నిరంతర ప్రక్రియ అని వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. జోర్డాన్, ఫ్రాన్స్ సహా ఇతర దేశాలు ఇప్పటికే గాజాలోకి ఆహార పొట్లాలను జారవిడిచాయి.
చిన్నారులు తీవ్ర పోషకాహారం లోపంతో బాధపడుతున్నారని ఐరాస అందోళన వ్యక్తం చేస్తోంది. ఆహార కొరత ఏర్పడి రోజుల తరబడి పస్తులు ఉంటున్నారు. ఆకలికి తాళలేక పశువుల దాణానే ఆహారంగా తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనడం బాధాకరం. ఈ సంక్షోభాన్ని నివారించాలంటే రోజుకు 500 ఫుడ్ ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. కానీ, జనవరిలో రోజుకు 150.. ఫిబ్రవరిలో 97 ట్రక్కులు మాత్రమే గాజాలోకి ప్రవేశించాయి.