West Bengal : పశ్చిమ బెంగాల్ జైళ్లలో మహిళా ఖైదీల గర్భం దాల్చిన వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ మేరకు కలకత్తా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికను కోరింది. రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీల సంఖ్య, భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 5లోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుందని జస్టిస్ జైమాల్యా బాగ్చి, జస్టిస్ అజయ్ కుమార్ గుప్తాలతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం తెలిపింది. రాష్ట్రంలోని 1,379 జైళ్ల ప్రస్తుత పరిస్థితిపై అదే సమయంలో నివేదిక ఇవ్వాలని స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీస్ (SLAS)ని కోరింది.
జైళ్లలో పరిస్థితులను పర్యవేక్షించడానికి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (AG) , ఇతర ప్రభుత్వ న్యాయవాదులతో కూడిన కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు రాష్ట్రంలోని దిద్దుబాటు సౌకర్యాల పరిస్థితిని వివరిస్తూ తపస్ భంజ్ శుక్రవారం కోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్ర జైలులో మహిళా ఖైదీలు గర్భం దాల్చిన కేసుకు సంబంధించి అన్ని పక్షాల సమావేశాన్ని పిలవాలని కలకత్తా హైకోర్టు గతంలో ఆదేశించింది. ఫిబ్రవరి 20న జస్టిస్ బాగ్చి, జస్టిస్ గౌరంగ్లతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్రం అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని పేర్కొంది. ఏం తేలిందో మార్చి 8న నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఏజీని ఆదేశించారు. కోర్టు ఎటువంటి ప్రెగ్నెన్సీ టెస్టును ఆదేశించదని కూడా కోర్టు తెలిపింది.