భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) చంద్రయాన్3 (Chandrayan-3) ప్రయోగంతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. అదే ఉత్సాహంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమైంది. భవిష్యత్తులో ఇస్రో అంతరిక్షంలో ఓ స్పేస్ స్టేషన్‌ను నిర్మించేందుకు ప్రణాళికి వేస్తోంది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ (Isro Chairman Somnadh) వెల్లడించారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.
భవిష్యత్తులో ఇస్రో వివిధ రకాల మిషన్లు చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. స్పేస్ స్టేషన్, దీర్ఘకాలం ప్రయాణించేలా మానవసహిత స్పేస్ ఫ్లైట్‌ను కూడా రూపొందించనున్నట్లు తెలిపారు. ఆ స్పేస్ స్టేషన్ భారత ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా లాభం చేకూరుస్తుందో పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇస్రో గగన్‌యాన్‌పై దృష్టి సారించిందన్నారు.
గగన్ యాన్ తర్వాత వ్యోమగాములను అంతరిక్షానికి పంపి, అక్కడ స్పేస్ స్టేషన్ నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. రోబోటిక్ ఆపరేషన్‌తో ఈ ప్రక్రియ చేపట్టనున్నామని, ప్రస్తుతం మానవ సహిత ఫ్లైట్ సామర్థ్యం భారత్‌కు లేదని తెలిపారు. ఆ విషయంపై దృష్టి పెట్టామని, గగన్‌యాన్‌తో ఈ సామర్థ్యం అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. గగన్‌యాన్ సాకారమైతే తదుపరి 20-25 ఏళ్లలో స్పేస్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందన్నారు.