»In Budget 2024 Government May Double Ayushman Bharat Limit Preparation For Free Treatment Up To Rs 10 Lakh
Budget 2024: రూ. 10 లక్షల వరకు ఉచిత చికిత్స.. ఆయుష్మాన్ భారత్ పరిమితిని రెట్టింపు
ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి వినే ఉంటారు. వచ్చే మూడేళ్లలో చికిత్స కోసం బీమా మొత్తాన్ని రెట్టింపు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Budget 2024: ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి వినే ఉంటారు. వచ్చే మూడేళ్లలో చికిత్స కోసం బీమా మొత్తాన్ని రెట్టింపు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో 70 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రాథమికంగా బీమా కవరేజీని ఏటా రూ.10 లక్షలకు పెంచనున్నారు. నేషనల్ హెల్త్ అథారిటీ రూపొందించిన అంచనాల ప్రకారం ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే ఖజానాపై ఏడాదికి రూ.12,076 కోట్లు అదనంగా ఖర్చవుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కవరేజీ పరిమితి రూ. 5 లక్షలు.
ఈ ప్రతిపాదనలు జులై నెలాఖరులో సమర్పించే కేంద్ర బడ్జెట్లో ప్రకటించాలని భావిస్తున్నారు. 2024 మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) కోసం కేటాయింపులను రూ. 7,200 కోట్లకు పెంచింది. ఇది 12 కోట్ల కుటుంబాలకు సంవత్సరానికి రూ. 5 లక్షలను అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) కోసం రూ.646 కోట్లు కేటాయించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 27న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరూ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు వస్తారు. వారికి ఉచిత చికిత్స ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. 70 ఏళ్లు పైబడిన వారితో సహా, ఈ పథకం కింద దాదాపు 4-5 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు.