»Imd Issues Severe Heat Warning For Northwest India Monsoon Over Andaman Nicobar
IMD : అండమాన్‌ను తాకిన నైరుతీ రుతుపవనాలు.. ఆ రాష్ట్రాలకు హీట్ వార్నింగ్
నైరుతీ రుతుపవనాలు భారత దేశంలోకి ప్రవేశించాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోకి అవి ముందుగా వచ్చినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో పక్క కొన్ని రాష్ట్రాల్లో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
IMD : భారత దేశంలోని అండమాన్ నికోబార్(Andaman & Nicobar) దీవులకు ఇప్పటికే నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. మరో పక్క రాజస్థాన్, పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయని, అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు వడగాల్పులతో ఇబ్బందులు పడవచ్చని అందుకు తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది.
మరో వైపు మే 22వ తారీఖున నైరుతి బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ(IMD) వెల్లడించింది. అది 24వ తారీఖుకు వాయుగుండంగా మారనుంది. దీని వల్ల రానున్న మూడు రోజుల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు చెదురు మదురుగా పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఇక నైరుతీ రుతుపవనాలు ఏటా మే 18 నుంచి 20 మధ్యలో అండమాన్‌ను తాకుతాయి. ఈసారి కూడా సరిగ్గా అదే సమయంలో అవి మన దేశంలోకి ప్రవేశించాయి. ఈ అంచనాలను బట్టి చూస్తే ఈ నెల 31న అవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. అలాగే జూన్ మొదటి వారంలో రాలసీమను తాకవచ్చని ఐఎండీ(IMD) తెలిపింది.