తాను బీజేపీలో చేరితే.. ఒక్కరోజులోనే మంత్రిగా ఛాన్స్ ఇస్తామని ఓ నాయకుడు నాకు ఆఫర్ ఇచ్చారంటూ నటి, లోక్సభ మాజీ సభ్యురాలు రమ్య (Former MP Ramya)వెల్లడించడం సంచలనం రేపింది. ఆ ఆఫర్ను తాను అప్పుడే తిరస్కరించానని ఆమె తెలిపారు.
భారతీయ జనతా పార్టీ (BJP) పై కన్నడ నటి, కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రమ్య(Former MP Ramya) సంచలన కామెంట్స్ చేశారు.బీజేపీలో చేరితే ఒక్క రోజులోనే మంత్రి పదవి ఇస్తానని ఓ నాయకుడు ఆఫర్ ఇచ్చారని ఆమె తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే, తాను ఆ ఆఫర్ను అప్పుడే తిరస్కరించినట్టు రమ్య అన్నారు. మాండ్యా (Mandya) మాజీ ఎంపీ అయిన రమ్య 2019లో కాంగ్రెస్ సోషల్ మీడియా (Social media)సెల్ ఇన్చార్జ్ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress party) తాజాగా ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆమె కూడా ఉన్నారు. తనకు బీజేపీపై వ్యతిరేకత లేదని.. అయితే ఆ పార్టీలోని కొందరు నాయకులు, వారి సిద్ధాంతాలు మాత్రం తనకు అస్సలు నచ్చవని తెలిపారు.
సినిమా నటులను ఎన్నికల ప్రచారానికి తీసుకొస్తే.. డబ్బులు పంచకుండానే జనం వస్తారని కొందరు నేతలు భావిస్తుంటారు. సినిమా నటులు, ప్రజాదరణ ఉన్న వ్యక్తులు వచ్చినంత మాత్రాన ఓట్లు రాలవంటూ హీరో సుదీప్ (hero Sudeep) టార్గెట్ చేసి అన్నారు. సీఎం బొమ్మై(CM Bommai)తో ఆయనకు ఉన్న వ్యక్తిగత అభిమానంతోనే ప్రచారాన్ని చేస్తున్నారని పేర్కొన్నారు. తనకూ ఇతర పార్టీల నుంచి ప్రచారానికి రావాలని ఆఫర్లు వచ్చినా నిరాకరించానని తెలిపారు. అయితే రమ్యను పార్టీలోకి రావాలని ఆహ్వానించేంత స్థాయికి బీజేపీ దిగజారలేదని మంత్రి అశోక్ (Minister Ashok)తెలిపారు. రమ్య చేసిన వ్యాఖ్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినప్పుడు పైవిధంగా స్పందించారు. ఆమె అవసరం బీజేపీకి లేదన్నారు. ఆమెను బీజేపీలోకి రావాలని ఆహ్వానించిన నాయకుడెవరో తనకు తెలియదని చెప్పారు.