Horrible Punishment : జార్ఖండ్ రాష్ట్రంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పీటీ క్లాస్(PET Class) కు హాజరు కాలేదని ఓ వార్డెన్ విద్యార్థినులకు భయంకరమైన పనిష్మెంట్(Punishment) ఇచ్చింది. బాలికలతో 200 సార్లు సిట్ అప్ లు చేయించింది. దీంతో వారంతా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆ బాలికల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలికలు ఆస్పత్రి(Hospital)లో చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. లతేహర్ జిల్లాలోని జార్ఖండ్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ (Jharkhand Girls Residential School)లో వార్డెన్ ఎలిజబెత్ కుముద్ టోప్పో గురువారం పీటీ క్లాస్ నిర్వహించింది. ఆ క్లాసుకు దాదాపు 170 మంది విద్యార్థినులు వెళ్లలేదు. కేవలం ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. దీంతో వార్డెన్ కు కోపం వచ్చింది. తరువాత ఆ బాలికలందరికీ పనిష్మెంట్ ఇచ్చింది. గేమ్స్ క్లాసుకు హాజరుకానందుకు శిక్షగా 200 సిట్ అప్(Sit Up) లు చేయాలని ఆదేశించింది. దీంతో వారంతా వార్డెన్ చెప్పినట్టు చేశారు. సిట్ అప్ లు పూర్తయిన తరువాత చాలా మంది బాలికలు స్పృహ తప్పి పడిపోయారు. వారిలో చాలా మందికి కాళ్ల నొప్పులు రావడంతో పాఠశాల సిబ్బంది హాస్టల్ లో ప్రథమ చికిత్స చేశారు. అయితే వీరిలో 10 మంది బాలికల పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు శుక్రవారం చికిత్స నిమిత్తం స్థానిక హెల్త్ వెల్ నెస్ సెంటర్ కు తరలించారు.
బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ దాస్ సమాచారం అందుకుని వెల్ నెస్ సెంటర్(Wellness Center) కు చేరుకున్నారు. గేమ్స్ క్లాసుకు హాజరకానందుకు వార్డెన్ వారిని శిక్షించారని, దీంతో వారిలో చాలా మంది అస్వస్థకు గురైనట్టు చెప్పారు. దీనిపై త్వరలోనే నివేదిక తయారు చేసి జిల్లా కేంద్రానికి అందజేస్తామని తెలిపారు. ఈ విషయమై వార్డెన్ ను సంప్రదించగా.. పాఠశాలలో విద్యార్థులందరికి ఆటలంటే భారం ఉన్నందున ఇకపై తాను అక్కడ పని చేయబోనని, తాను అక్కడి నుంచి బదిలీపై వెళ్తానని చెప్పినట్టు సమాచారం. గేమ్స్ క్లాసుకు హాజరు కానందుకు విద్యార్థులను శిక్షించినట్లు ఆమె అంగీకరించింది. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.