Yamuna: యమునా (Yamuna) నదీ మహోగ్రరూపం దాల్చింది. ఎగువన భారీ వర్షాలు కురవడం.. నీటిని విడుదల చేయడంతో వరద నీరు యమునా (Yamuna) నదిలోకి వచ్చి చేరుతుంది. ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యుమునా (Yamuna) నదీ నీటిమట్టం ప్రమాదకరంగా మారుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు నీటి మట్టం 208.51 మీటర్లకు చేరింది. 205 మీటర్లకు చేరితేనే డేంజర్ బెల్స్ మోగినట్టు లెక్క. 45 ఏళ్ల క్రితం ఇలా నీటి మట్టం చేరగా.. మళ్లీ ఇప్పుడు కూడా ఆ స్థాయి దాటింది.
భారీ వర్షాలతో హత్నీకుండ్ నుంచి హర్యానాకు నిరంతరం వరద దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నీటిమట్టం మరింత పెరగనుందని కేంద్ర జల కమిషన్ అంచనా వేస్తోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత హర్యానా బ్యారేజ్ నుంచి నీటి విడుదల తగ్గొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇళ్లలోకి నీరు చేరింది. చాలా చోట్ల రోడ్లపై మోకాలి లోతు వరకు నీరు చేరింది. సివిల్ లైన్స్ ప్రాంతంలో రింగ్ రోడ్డు పూర్తిగా నీటమునిగింది. కశ్మీరీ గేట్- మంజు కా తిలాని కలిపే చోట భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ కూడా కూతవేటు దూరంలో ఉంది.
వరద ప్రభావంతో ఢిల్లీలో 12 ఎన్డీఆర్ఎఫ్ (12 ndrf) బృందాలను రంగంలోకి దింపాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరించారు. వరద పరిస్థితుల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గల ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు మరికొన్ని రోజులు సెలవులు ఇచ్చారు.
#WATCH | The area near Nigam Bodh Ghat in Delhi gets flooded as river Yamuna overflows and floods low-lying nearby areas. pic.twitter.com/8briPb9rzq
ఢిల్లీ (delhi) వీధుల్లోకి వరద నీరు వస్తుండటంతో ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. రాజ్ ఘాట్ నుంచి నిజాముద్దీన్ క్యారేజ్ వే వరకు ఐపీ ఫ్లై ఓవర్ సమీపంలో మురుగునీరు పొంగిందని.. దీంతో రింగ్ రోడ్డుపై ట్రాఫిక్కు అంతరాయం కలిగిందని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. శాంతి వాన్, రాజ్ ఘాట్, జేఎల్ఎన్ మార్గ్, బహదూర్ షా జఫర్ మార్గ్ మీదుగా వెళ్లాలని సూచించారు.