Electric bike taxi: ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళ దినోత్సవం రోజున ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీల నిర్వహణపై నిషేధం విధించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లు మహిళలకు సురక్షితంగా లేకపోవడంతో పాటు మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం గుర్తించింది. అందుకే 2021 నాటి ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ స్కీమ్‌ను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని యాప్ ఆధారిత ప్రైవేటు సంస్థలు మోటారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం.
ద్విచక్ర వాహనాలు ప్రయాణాలకు అనువు కానీ.. ట్రాన్స్పోర్ట్ వాహనాలుగా ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఈ స్కీమ్ వల్ల పన్నులు వసూలు చేయడం కూడా కష్టం ఉంది. ప్రయాణికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లతో ఈ బైక్ రైడర్లు ఘర్షణ పడుతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ఈ కారణంగా శాంతి భద్రతలు, మహిళల రక్షణ దృష్ట్యా ఈ స్కీమ్‌ను రద్దు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. బీజేపీ ప్రభుత్వం 2021లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ సేవలను అమల్లోకి తెచ్చింది. అప్పుడే దీన్ని ఆటో, క్యాబ్, డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. వాటిని రద్దు చేయాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.