Surgery : దిల్లీలో శునకానికి అరుదైన హార్ట్ సర్జరీ.. ఆసియాలోనే మొదటిసారి!
దిల్లీలోని ఓ ప్రైవేటు పెట్ హాస్పిటల్లో శునకానికి ఓ అరుదైన ఆపరేషన్ చేశారు. దాని శరీరాన్ని కోయకుండానే రక్త నాళం ద్వారా ఒక సాధనాన్ని పంపించి గుండె ఆపరేషన్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
Dog Heart Surgery : దిల్లీలోని ఓ ప్రైవేట్ పెట్ ఆసుపత్రికి చెందిన పశు వైద్యులు ఓ శునకానికి అరుదైన హార్ట్ ఆపరేషన్ చేశారు. ఇలాంటి ఆపరేషన్(SURGERY) చేయడం ఆసియాలోనే మొదటి సారి అని వారు చెబుతున్నారు. దిల్లీకి చెందిన జూలియట్ అనే శునకం రెండేళ్లుగా గుండె సంబంధిత ఇబ్బందితో బాధ పడుతోంది. వయసుతో వచ్చే ఈ సమస్య వల్ల గుండె కవాటాల్లో సమస్య మొదలైంది. ఇది ఎక్కువ అయితే గుండె ఎడమ గదిలోని బ్లడ్ వెనక్కి వెళుతుంది. ఈ సమస్య ముదిరే కొద్దీ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్‌లు అధికంగా ఉంటాయి.
దీంతో ఈ శునకానికి గుండె ఆపరేషన్(DOG HEART SURGERY) చేసేందుకు దిల్లీలోని(DELHI) మ్యాక్స్ పెట్స్ హాస్పిటల్ వైద్యులు ముందుకొచ్చారు. అందుకు ట్రాన్స్ కేథతర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపెయిర్ (TEER) అనే ప్రక్రియను ఎంచుకున్నారు. ఈ మెథడ్‌లో ఆపరేషన్ చేసేందుకు శునకం శరీరాన్ని కోయాల్సిన అవసరం ఉండదు. దాని రక్త నాళాల ద్వారా ఓ చిన్న సాధనాన్ని లోపలికి పంపించారు. దాని సాయంతో ఆపరేషన్ పూర్తి చేశారు. గుండె కొట్టుకుంటూ ఉండగానే ఈ ప్రక్రియ అంతా విజయవంతంగా పూర్తి అయ్యింది.
రెండు రోజుల తర్వాత ఆ శునకాన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడం ఆసియా చరిత్రలో ఇదే మొదటి సారి అని వారు తెలిపారు. ఇలాంటి ఆపరేషన్ ప్రపంచంలోనే రెండో సారి తమ ఆసుపత్రిలో జరిగిందని చెప్పారు.