తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ల అసంతృప్తికి ఫుల్స్టాప్ పడలేదా?
అధిష్టానం చర్యలతో వారు కూల్ కాలేదా?
పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మార్పుతో సంతృప్తిగా లేరా?
రేవంత్ రెడ్డి తీరును వారు ఏమాత్రం జీర్ణించుకోవడం లేదా?
ఇటీవల కొన్ని పార్టీ కార్యక్రమాలను చూస్తే కాంగ్రెస్లో అసంతృప్తి రాగానికి దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లుగా కనిపించింది. బుధవారం భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో చేపట్టనున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్ ప్రణాళికపై రేవంత్ రెడ్డి దిశా నిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమం బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగింది. ఈ శిక్షణా శిబిరానికి పలువురు నేతలు గైర్హాజరు కావడం పార్టీలో అసంతృప్త రాగానికి ఫుల్స్టాప్ పడలేదనే చర్చకు దారి తీసింది. రేవంత్ తీరు పట్ల పలువురు సీనియర్లు మీడియాకు ఎక్కగా, వెంటనే రంగంలోకి దిగిన అధిష్టానం దిగ్విజయ్ సింగ్ను హైదరాబాద్ పంపించింది. ఆయన ఇరువర్గాలతో మాట్లాడి, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ స్థానంలో మహారాష్ట్ర సీనియర్ నేత మాణిక్ రావు ఠాకరేను తీసుకు వచ్చారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో విభేదాలను పరిష్కరించుకొని, కలిసి ముందుకు సాగాలని ఢిల్లీ పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు. అయితే నిన్నటి శిక్షణా శిబిరానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్, వి హనుమంత రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతా రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్యే పోదెం వీరయ్య, ఏఐసీసీ సెక్రటరీ వంశీ చందర్ రెడ్డి, హాజరు కాలేదు. రేవంత్ వ్యతిరేకులుగా ముద్రపడినవారిలో మల్లు భట్టి విక్రమార్క, కోదండ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఈ సీనియర్లతో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడి, శిక్షణ తరగతులకు హాజరు కావాలన్నారు. పార్టీ అధ్యక్షుడి సూచనలు ఉన్నప్పటికీ, వాటిని పక్కన పెట్టి దూరంగా ఉండటం గమనార్హం.
తన పట్ల సీనియర్లకు అసంతృప్తి ఏమాత్రం తగ్గకపోవడంతో శిక్షణా తరగతుల సమయంలో హాట్ కామెంట్స్ చేశారని అంటున్నారు. రేవంత్ నిన్న మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే తాను పదవులను, ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అవసరమైతే పీసీసీ పదవిని కూడా వీడేందుకు సిద్ధమన్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పని చేస్తానన్నారు. అధిష్టానం వేరెవరికి బాధ్యతలు అప్పగించినా వారిని భుజానికి ఎత్తుకుంటానన్నారు. పార్టీ ఏం ఆదేశించినా సామాన్య కార్యకర్తలా పని చేస్తానన్నారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే సర్దుకుందామని, భేషజాలకు వెళ్లకుండా కలిసి పని చేద్దామని సూచించారు. సీనియర్లు అసంతృప్తి అంటూ నిత్యం ఇబ్బంది పెడుతుండటంతో రేవంత్ ఏం చేయలేక రాజీనామా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.