CPI Narayana: తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్, హర్యానా రైతులు బుధవారం నిరసన కార్యక్రమాలను పునఃప్రారంభించారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఓ యుద్ధమే జరిగింది. పంజాబ్, హర్యానా సరిహద్దులోని ఖనౌరీలో హింస చెలరేగింది. ఈ హింసలో 21 ఏళ్ల యువ రైతు శుభా కరణ్ సింగ్ చనిపోయాడు. తలకు బుల్లెట్ గాయం కావడంతో అతడు మరణించాడు. పోలీసుల కాల్పుల వల్లే రైతు మృతి చెందాడని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో రైతుల పోరాటంపై సీపీఐ నారాయణ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను టెర్రరిస్టుల మాదిరిగా చూస్తుందన్నారు. వారిపై చేసినట్లు రైతుల పై దాడులు చేయడం ఆందోళనకర విషయమన్నారు.
కనీస మద్దతు ధర మాత్రమే కదా రైతులు అడిగేదని.. పోలీసుల కాల్పుల్లో నిన్న ఒక యువ రైతు మరణించారు…అది ముమ్మాటికీ సర్కారు, మోడీ హత్యేనన్నారు. రైతులు టెర్రరిస్ట్ లు, దేశ ద్రోహులు కాదు. కేంద్రం హత్య చేయాలనుకుంటే 30మంది కార్పొరేట్లు ఉన్నారు వాళ్లను చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్షల కోట్లు ముంచి దేశాన్ని ముంచిన వాళ్ళను వదిలేస్తుంది కేంద్రం. 33శాతం నుంచి 27శాతానికి కార్పొరేట్ల టాక్స్ తగ్గించి, 25శాతం ఉన్న టాక్స్ 35శాతం సామన్యులది పెంచారని నారయణ వివరించారు. మోడీ అందాల పోటీలో పాల్గొంటే ప్రపంచ నంబర్ వన్ గా వస్తారు. అయోధ్య రాముడు మోసగాళ్ళ పక్షాన ఉంటారా? పేదల పక్కన ఉంటారా అని ప్రశ్నించారు. ఇండియా కూటమిని బలహీన పర్చడానికి మహారాష్ట్ర నుంచి కుట్రలు మొదలు పెట్టారు. ఎలెక్టోరల్ బాండ్స్ పేరుతో వచ్చిన డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా వామపక్షాలు 35 సీట్లకు ప్రణాళికలు చేసుకుంది. క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి దేశానికి హోం మినిస్టర్ అయ్యారంటూ నారాయణ మండి పడ్డారు. లోక్ సభ లో కాంగ్రెస్ తో పొత్తు కోసం ఐదు సీట్ల ప్రతిపాదన పెట్టాం. ఇండియా కూటమికి తెలంగాణలో మంచి ఫలితాలు రావాలంటే ఒక్క ఎంపి సీటైనా సీపీఐ కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒక్క సీటు అయినా సర్దుబాటు కాకపోతే ఫలితాల్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉందన్నారు.