కేంద్ర పోలీసు బలగాలకు హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేశాయి. సోషల్ మీడియా(Social media)లో రీల్స్ చేయొద్దని హెచ్చారించారు. భద్రతా బలగాల్లో పనిచేస్తున్న వ్యక్తులపై వలపు వల విసిరి దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కాజేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. వీటి వల్ల హానీట్రాప్ (Honey Trap) ముప్పు పెరుగుతుందని, తద్వారా సున్నితమైన సమాచారం శత్రువులకు చేరుతుందని తెలిపాయి.ఇటీవల కేంద్ర నిఘా సంస్థలు (central Intelligence agency) చేపట్టిన పరిశీలనలో.. కొందరు సిబ్బంది యూనిఫామ్‌లో తమ వీడియోలను సోషల్‌మీడియా (Social Media)లో షేర్ చేస్తున్నట్లు తెలిసింది. అంతేగాక, సున్నితమైన లొకేషన్లలో దిగిన ఫొటోలను షేర్ చేయడం, ఆన్లైన్(Online)లో స్నేహితుల కోసం రిక్వెస్ట్‌లు పంపుతున్నట్లు ఆ సంస్థలు గుర్తించాయి. దీనిపై కేంద్ర పారామిలిటరీ, పోలీసు (Police) బలగాలకు లేఖ రాశాయి.
దీంతో అప్రమత్తమైన పోలీసు బలగాలు తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాయి. యూనిఫామ్(Uniform)లో ఉన్న వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దని, గుర్తుతెలియని వ్యక్తులతో ఆన్లైన్లో స్నేహం చేయొద్దని తెలిపింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించాయి. సీఆర్పీఎఫ్ (CRPF), బీఎస్ఎఫ్ (BSF), ఐటీపీబీ (ITBP) సిబ్బందికి ఈ ఆదేశాలు అందాయి. దిల్లీ పోలీసు (Delhi Police) కమిషనర్ సంజయ్ అరోఢా కూడా తమ బలగాలకు ఇలాంటి హెచ్చరికలే జారీ చేశారు. ‘‘విధుల్లో ఉన్నప్పుడు సోషల్ మీడియాను వినియోగించొద్దు. సున్నితమైన సమాచారాన్ని పోస్ట్ చేయొద్దు. యూనిఫామ్‌లో రీల్స్, వీడియోలు వంటిని చేయొద్దు. హై-సెక్యూరిటీ (High-security)ప్రాంతాలు, ప్రముఖుల వీడియోలు తీయొద్దు’’ అని హెచ్చరించారు.