Boy Kicks Bomb : ఆడుకునే బాల్ అనుకుని ఓ బాలుడు బాంబును కాలితో తన్నాడు. దీంతో అక్కడ పెద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటనలో మరో ఇద్దరు బాలురకు గాయాలయ్యాయి. పశ్చిమ బంగాల్లోని పాండువాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పాండువా పట్టణంలో సోమవారం ఉదయాన్నే రాజ్ బిస్వాస్ అనే పదకొండేళ్ల బాలుడు(BOY) మరో ఇద్దరితో కలిసి ఆడుకుంటున్నాడు. అతడు ఆడుకునే స్థలంలో గుండ్రంగా ఉన్న నాటు బాంబు(BOMB) పడి ఉంది. దాన్ని రాజ్ బాల్ అనుకుని కాలితో గట్టిగా తన్నాడు. ఆ ఒత్తిడికి అది వెంటనే అక్కడే పేలిపోయింది. దీంతో రాజ్ తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే అతడిని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమించి చివరికి మృతి చెందాడు.
రాజ్ బిస్వాస్ నిజానికి అక్కడి బుర్ద్వాన్కు చెందిన వాడు. వేసవికాలం సెలవుల్లో మామయ్య ఇంటికి పాండువాకి వచ్చాడు. అక్కడ ఇలా చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరిని సౌరవ్ చౌదరి(13), రూమప్ బల్లభ్(13)లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. సౌరవ్ కాలికి, రూపమ్ చేతులకు గాయాలయ్యాయని తెలిపారు.