»Another Sensation In Delhi Liquor Case Ycp Mp As Approver
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం..అప్రూవర్‌గా వైసీపీ ఎంపీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈడీ అధికారులు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరిని విచారిస్తున్నారు.
దేశంలో ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case) దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి (Magunta Srinivas Reddy) అప్రూవర్‌గా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మాగుంట శ్రీనివాస్ రెడ్డి కీలక సమాచారాన్ని అందించారు. ఈ లిక్కర్ కేసులో ఇప్పటి వరకూ సౌత్ గ్రూప్ నుంచే ఎక్కువ మంది అప్రూవర్లుగా మారడంతో ఈ కేసు మరింత కీలకం కానుంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి (Raghava Reddy) అప్రూవర్‌గా మారారు. రాఘవ రెడ్డితో పాటుగా శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్ అయ్యారు. అయితే రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈ ముగ్గురూ ఈడీ అధికారులకు సహకరిస్తున్నారు. వీరిచ్చే సమాచారం ఆధారంగానే అనేక మందిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నుండి ఢిల్లీకి నగదు బదిలీలపై ప్రధానంగా ఈడీ ఫోకస్ (ED Focus) పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్గతంగా ఈడీ వర్గాలు కేసును తవ్వుకుంటూ వెళ్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్‌గా దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణ (Telangana)కు సంబంధించిన కీలక వ్యవహారాలు కూడా తెరమీదకు రానున్నాయని ఈడీ వర్గాల సమాచారం.
ఈ కేసులో ముఖ్యంగా కొన్ని రోజులుగా హవాలా వ్యవహారాలు నడిపే 20 మందిని అధికారులు ప్రశ్నించారు. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) ఆడిటర్ బుచ్చిబాబును ఈమధ్యనే మరోసారి ప్రశ్నించారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకొంతమందిని ఈడీ (ED) అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.