Eating Bacteria: ఓరి నాయనో..మనిషి మాంసం తినేసే బ్యాక్టీరియా..!
ఇప్పటి వరకూ అందరూ కరోనాతో భయపడ్డారు. అయితే ఇప్పుడు ఏకంగా మనిషి శరీరాన్ని తినేసే బ్యాక్టీరియా విజృంభిస్తోంది. దీని వల్ల ప్రతి ఏడాది చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ బ్యాక్టీరియా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
మానవ శరీర మాంసాన్ని తినేసే ఓ బ్యాక్టీరియా ఇప్పుడు అందర్నీ భయాందోళనకు గురిచేస్తోంది. ఈ బ్యాక్టీరియా వల్ల మనుషులు చనిపోతున్నారు. ఇలాంటి కేసులు అమెరికాలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (Centers for Disease Control) (CDC) హెచ్చరికలు జారీ చేసింది.
విబ్రియో వల్నిఫికస్ (Vibrio Vulnificus) అనే బ్యాక్టీరియా గాయాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అది క్రమంగా చర్మాన్ని, కండరాలను తినేస్తూ వెళ్తుంది. రక్తనాళాలను కూడా తినేయగా ఆ మనిషి పొత్తికడుపు తిమ్మిరిగా మారుతుంది. వారికి వికారంతో పాటుగా వాంతులు కూడా అవుతాయి. చలిజ్వరం వస్తుంది. ఇటువంటి లక్షణాలతో ఇప్పటి వరకూ అమెరికాలో 12 మంది చనిపోయారు.
అమెరికాలో ప్రతి ఏటా ఈ బ్యాక్టీరియా వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రతి ఏడాది దాదాపు 80,000 మంది విబ్రియో ఇన్ఫెక్షన్ బారిన పడుతుండగా వానిలో 100 మంది చనిపోతున్నారు. చాలా మంది పచ్చిమాంసం, పచ్చి నత్తగుల్లలు, షెల్ఫిష్లు తినడం ద్వారా ఈ బ్యాక్టీరియా బారిన పడతారని నిపుణులు తెలుపుతున్నారు.
శరీరంలో ఏదైనా గాయం ఉన్నవారు నీటిలో దిగితే ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. సముద్రాలు వంటి వాటిలో దిగితే శరీరంపై గాయాల ద్వారా బాడీలోకి వెళ్తుందని వైద్యులు తెలిపారు. శరీరంపై గాయాలు ఉన్నవారు ఉప్పునీరు, బ్రాకిష్ వాటర్‌కు దూరంగా ఉండాలని, ఒక వేళ అటువంటి నీటిలో దిగితే శుభ్రమైన నీటితో స్నానం చేయాలని, ఉడికించని షెల్ఫిష్లను తీసుకోవద్దని సీడీసీ హెచ్చరికలు జారీ చేసింది.