ఎయిరిండియా (Air India) ఢిల్లీ నుండి శాన్ఫ్రాన్సిస్కో వెళ్లిన ప్యాసింజర్కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల రష్యా(Russia)లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రత్యేక విమానాన్ని పంపించడంతో ప్రయాణికులు మగడాన్ నుండి గురువారం శాన్ఫ్రాన్సిస్కో (San Francisco) చేరుకున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఎయిరిండియా ఈ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. అంతేకాదు, వారికి రిఫండ్ (Refund)ఆఫర్ ప్రకటించింది. మిమ్మల్ని శాన్ ఫ్రాన్సిస్కోకు చాలా ఆలస్యంగా తీసుకువెళ్లినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నామని, సాంకేతిక సమస్య రావడంతో ఈ ఇబ్బంది ఎదురైనట్లు ఎయిరిండియా తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్ (Emergency Land) చేశామన్నారు. మిమ్మల్ని తరలించేందుకు మరో ప్రత్యేక విమానం (aircraft) పంపించినప్పటికీ అది కూడా ఆలస్యం అయిందని పేర్కొంది. మీ సహనానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని, గతాన్ని మేం మార్చలేమని, కానీ మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. ఇందుకు గాను మీ ప్రయాణానికి పూర్తి రిఫండ్ ఇస్తామని, ఫ్యూచర్(future)లో మా విమానాల్లో ప్రయాణించేందుకు ఓ ట్రావెల్ వోచర్ కూడా ఇస్తున్నామని తెలిపింది.