YS Avinash Reddy: మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిని (YS Avinash Reddy) 8వ నిందితుడిగా చేర్చింది. ఇదివరకు ఫైల్ చేసిన కౌంటర్లో సహ నిందితుడిగా పేర్కొన్నగా.. ఇప్పుడు నిందితుడిగా మార్చింది. వివేకా హత్య కేసులో బెయిల్ ఇవ్వాలని సీబీఐ కోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆ కేసు విచారణ శుక్రవారం జరగనుండగా.. సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.
వివేక హత్య కేసులో ఈ నెల 5వ తేదీన దాఖలు చేసిన కౌంటర్లో ఏ8గా సీబీఐ అధికారులు పేర్కొన్నారు. వివేకానంద హత్యకు కుట్ర, సాక్ష్యాలను చెరిపివేయడంలో వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి (YS Avinash Reddy)ప్రమేయం ఉందని వివరించింది. ఇందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సీబీఐ (cbi) తెలిపింది. కేసును పక్కదారి పట్టించేలా, సాక్షులను ప్రభావితం చేసేలా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని సీబీఐ అధికారులు చెబుతున్నారు. శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలో అవినాష్ హత్య జరిగిన స్థలానికి వెళ్లారని సీబీఐ అధికారులు తెలిపారు.
వివేకా హత్య జరిగిన రోజు ఉదయం 5.20 గంటలకు ముందే అవినాష్ (Avinash), శివశంకర్ రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడారట. ఈ మేరకు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని కౌంటర్లో సీబీఐ పేర్కొంది. కేసు పెట్టొద్దని.. పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యను అవినాష్ (Avinash), శివశంకర్ రెడ్డి చెప్పారని వివరించింది. సీబీఐ, కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని పేర్కొంది.