కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి చీటికీ మాటికీ కయ్యం పెట్టుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ఉన్నట్టుండి మద్దతు తెలిపింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ యూనిఫాం సివిల్ కోడ్ కు సూత్రప్రాయ మద్దతును ప్రకటించింది. ఉమ్మడి పౌర స్మృతితో ముడిపడిన సైద్ధాంతిక వైఖరికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆప్ నేత సందీప్ పాఠక్(Sandeep Pathak) తెలిపారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఉమ్మడి పౌర స్మృతి అంశం తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఒక దేశంలో రెండు చట్టాలు ఎందుకని సాక్షాత్తూ ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో ఆప్ నేత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, ప్రధాని వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్(Congress) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చీలికలు పెద్దవవుతాయని హెచ్చరించింది. ఆధిపత్య భావజాలంతో తనదైన ఎంజెడాతో ముందుకెళుతున్న ప్రభుత్వం ప్రజలపై ఉమ్మడి పౌర స్మృతి(Civic memory)ని బలవంతంగా రుద్దకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత పీ.చిదంబరం (P. Chidambaram) వ్యాఖ్యానించారు. కాగా, ముస్లిం మత సంస్థలు కూడా ఈ అంశంపై చర్చలు ప్రారంభించాయి. రోడ్డెక్కి నిరసనలకు దిగొద్దంటూ ముస్లింలకు జమైత్ ఉలేమా ఏ హింద్ బోర్డు సభ్యుడు అర్షద్ మద్ని విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఉమ్మడి పౌరస్మృతి మీద చర్చను ప్రధాని లేవనెత్తారంటూ కాంగ్రెస్, డీఎంకే (DMK), మజ్లిస్ పార్టీలు మండిపడ్డాయి.