పెళ్లైన ప్రతి మహిళ మాతృత్వాన్ని (Motherhood) పొందేందుకు ఎన్నో కలలుకంటుంది. పిల్లలు కలగాలని, అమ్మా అని పిలుపించుకోవాలని ఆరాట పడుతుంది. ఇదే కోవలో ఓ 58 ఏళ్ల వయసున్న సంతానం (offspring) లేని మహిళ సంతానం పొందాలని అనుకుంది. పిల్లలు లేని ఆమె సొసైటీ(Society)లో చిన్న చూపుకుగురైంది. దీంతో ఆమె వైద్యురాలిని సంప్రదించింది. ఆ వృద్ధ మహిళకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఐవిఎఫ్(IVF) పద్దతిలో సంతానాన్ని కలిగించారు. వైద్య చరిత్రలో ఇదో అరుదైన ఘట్టంగా చరిత్ర సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే…రాజస్థాన్ (Rajasthan) కు చెందిన 58 ఏళ్ల వయసున్న షేరా బహదూర్ కు సంతానం లేదు.
పిల్లలు లేరని మనోవేధనకు గురవుతుండేది. అయితే వైద్యరంగంలో వచ్చిన ఆధునిక పద్దతుల ద్వారా సంతానం పొందవచ్చునని తెలుసుకుంది. దీంతో ఆమె బికనీర్ (Bikaner) లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ షెఫాలి(Shefali)ని కలిసింది. ఆ మహిళకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఐవిఎఫ్ ప్రక్రియను ప్రారంభించారు. ఐవిఎఫ్ సక్సెస్ కావడంతో 58 ఏళ్ల మహిళ పండంటి కవలలకు (twins) జన్మనిచ్చింది. కవలల్లో ఒక పాప ఒక బాబు ఉన్నారు. తల్లీబిడ్డలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు. తల్లి కావాలన్న తన కోరిక నెరవేరడంతో ఆ మహిళ, వారి కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు.
వృధ్యాప్యం (old age) అంచుకు చేరుకున్న ఓ మహిళ ఇలా ఏకంగా కవలలకు జన్మనివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.ముఫ్ఫై ఏళ్లలోపు సమయం మహిళలకు సంతానం పొందేందుకు అత్యంత అనుకూలమైన టైం అని డా.షెఫాలీ వ్యాఖ్యానించారు. అయితే, అనేక కారణాల రీత్యా అనేక మంది మహిళలకు పిల్లలు కలగడం ఆలస్యమవుతుందని చెప్పారు. ఆధునిక వైద్య విధానాల ద్వారా 50 ఏళ్లు దాటిన తరువాత కోసం మహిళలు (women) సంతానం కోసం ప్రయత్నించవచ్చని చెప్పుకొచ్చారు.