గుండెపోటుతో 20 ఏళ్ల యువకుడు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. అప్పటి వరకూ బాగానే ఉన్న ఆ వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
గత కొన్ని రోజుల నుంచి హార్ట్ ఎటాక్(Heart Attack) ఘటనలు ఎక్కువవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దవారి వరకూ గుండెపోటు బారిన పడుతున్నారు. అందులో కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. తాజాగా ఓ 20 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించిన సంఘటన తమిళనాడు(Tamilnadu)లో చోటుచేసుకుంది.
మారథాన్ పరుగులో పాల్గొన్న ఓ యువకుడు గుండెపోటు(Heart Attack) తో చనిపోయాడు. మధురైలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆదివారం ఉదయం తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పి.మూర్తి జెండా ఊపి ఉతిరమ్ 2023 బ్లడ్ డొనేషన్ మారథాన్ పరుగును ప్రారంభించిన తర్వాత ఆ ఘటన జరిగింది. కల్లకురిచి ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి దినేశ్ కుమార్ ఈ మారథాన్‌లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశాడు.
కార్యక్రమం అయిన ఓ గంట పాటు బాగానే ఉన్నా తనకు ఏదో తెలియని ఇబ్బంది ఉందంటూ వాష్ రూమ్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత బాత్రూమ్లో పడి ఫిట్స్ వచ్చినట్టు గిలగిలా కొట్టుకోవడంతో ఫ్రెండ్స్ అతడ్ని స్థానికంగా ఉండే రాజాజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది. గుండెపోటు(Heart Attack) తో ఆ యువుకుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.