753 new covid cases recorded india on december 23rd 2023
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం శనివారం దేశంలో గత 24 గంటల్లో 752 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే ఈరోజు కేసులు మరింత పెరగడం విశేషం. అంతేకాదు ఇది మే 21, 2023 తర్వాత అత్యధికంగా నమోదైన కేసులని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం క్రియాశీల కేసులు 3,420కి పెరిగాయి. దీంతోపాటు దేశంలో గురువారం వరకు కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 ఇరవై రెండు కేసులు గుర్తించారు. 21 కేసులు గోవా నుంచి, మరొకటి కేరళ నుంచి నమోదయ్యాయని అధికారిక వర్గాలు తెలిపాయి. గోవాలో, JN.1 వేరియంట్ కేసుల క్లస్టరింగ్ కనిపించలేదని, సోకిన వారందరూ ఎటువంటి సమస్యలు లేకుండా కోలుకున్నారని ఆయా వర్గాలు తెలిపాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశంలో 640 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసుల సంఖ్య ముందు రోజు 2,669 నుండి 2,997 కి పెరిగింది.
అయితే భారతదేశంలో నమోదైన కేసుల్లో ప్రధానంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలు పాటించాలన్నారు. ఇక కోవిడ్ సోకిన వారిలో దాదాపు 93% మంది తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో కేవలం 0.1% మంది మాత్రమే వెంటిలేటర్ సపోర్ట్‌లో ఉన్నారు. 1.2% మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేరారు. 0.6% మంది ఆక్సిజన్ సపోర్ట్‌లో ఉన్నారని ప్రభుత్వ డేటా తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం JN.1 ప్రస్తుతం చలామణిలో ఉన్న ఇతర రకాలతో పోలిస్తే ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది. ప్రస్తుత వ్యాక్సిన్లు తీవ్రమైన వ్యాధి, మరణాలను నివారించగలవని ప్రస్తుతం ఉన్న ఆధారాలు సూచిస్తున్నాయని UN ఆరోగ్య సంస్థ చెబుతోంది.