ప్రయాణీకుల కోసం గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.59,000 కోట్ల మేర రాయితీ ఇచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేలో సీనియర్ సిటిజన్లకు అప్పుడే రాయితీ కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వేలో పెన్షన్లు, వేతనాలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. కాబట్టి సీనియర్లకు రాయితీ పునరుద్ధరణ అప్పుడే కుదరదని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎంపీ నవ్నీత్ రాణా లోకసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం చెప్పారు. సీనియర్ సిటిజన్లకు ఇదివరకు ఇచ్చిన రాయితీని ఎప్పుడు పునరుద్ధరిస్తారని ఆయన ప్రశ్నించారు.
కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పటి నుండి సీనియర్ సిటిజన్లకు రాయితీని నిలిపివేశారు. అంటే రెండున్నర సంవత్సరాలు దాటింది. కేంద్రం ప్రయాణీకుల కోసం రూ.59 వేల కోట్లకు పైగా రాయితీలు ఇచ్చిందని, ఇది దేశంలోని పలు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే కూడా చాలా ఎక్కువ అన్నారు. పెన్షన్ల కోసం రూ.60వేల కోట్లు, వేతనాల కోసం రూ.97వేల కోట్లు, చమురు కోసం రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, కొత్త సదుపాయాలను ఎప్పటికి అప్పుడు కల్పిస్తున్నామన్నారు. అందుకే సీనియర్లకు రాయితీ అప్పుడే తీసుకు రాలేమన్నారు.