గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్ నేడు (గురువారం, డిసెంబర్ 8) ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. పోస్ట్ పోల్ సర్వే ప్రకారం గుజరాత్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో గట్టి పోటీని ఎదుర్కొంటుంది. గుజరాత్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం, ఇప్పటికే అక్కడ బీజేపీ ఆరుసార్లు అధికారంలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే క్రితంసారి కంటే ఈసారి మరింత ఎక్కువ సీట్లు, ఓట్లు వస్తాయని పోస్ట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఢిల్లీ, పంజాబ్ తర్వాత గుజరాత్లో చక్రం తిప్పుదామని భావించిన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చుక్కెదురవుతుందని పోస్ట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. బీజేపీ 120 స్థానాల నుండి 140 స్థానాల వరకు, కాంగ్రెస్‌కు 70 స్థానాల వరకు, ఆమ్ ఆద్మీ పార్టీకి డబుల్ డిజిట్ కష్టమేనని వెల్లడించాయి.
ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. సాధారణంగా ఎక్కువ వోట్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (EVM)లలో పడితే, కొన్ని ఓట్లు పోస్టల్ బ్యాలెట్లలో పడతాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోస్టల్ బాక్స్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన అరగంట తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. అందుకే కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఏదైనా లెక్కింపు బయటకు వస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఫలితం అయి ఉంటుంది. పరిమిత ఓటర్లు కొంతమంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు. అధికారిక బ్యాలెట్ పేపర్ పైన తన ప్రాధాన్యతా ఓటును నమోదు చేసి, కౌంటింగ్‌కు ముందు ఎన్నికల అధికారికి తిరిగి పంపడం ద్వారా తన ఓటును రిమోట్‌గా నమోదు చేసుకోవచ్చు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి సాయుధ దళాల సభ్యులు, రాష్ట్రంలోని సాయుధ పోలీసు దళ సభ్యులు, దేశం వెలుపల పోస్టింగ్ చేయబడిన ప్రభుత్వ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు తదితరులు పోస్టల్ బ్యాలెట్ ఓటుకు అర్హులు.
గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మెజార్టీ కోసం 92 సీట్లు రావాలి. బీజేపీకి 120 సీట్లకు పైగా వస్తాయని పోస్ట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 35 సీట్లు గెలవాలి. ఈ వార్త రాసే సమయానికి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓటింగ్ ప్రారంభం కావడంతో పాటు, గుజరాత్లో బీజేపీ 7 సీట్లలో ముందంజలో ఉండగా, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 3, కాంగ్రెస్ 1 స్థానంలో ముందంజలో ఉంది. రెండు రాష్ట్రాల్లోను బీజేపీ దూసుకెళ్తున్నట్లుగా ప్రారంభ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.