Vyooham Movie: ఈరోజు విడుదల కావాల్సిన వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది. రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ఆధారంగా సినిమాను విడుదల చేయడానికి వీల్లేదని రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌లకు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఈ సినిమా ట్రైలర్ ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎవరికి పరువు నష్టం కలుగుతుందని భావిస్తే వాళ్లే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని న్యాయవాది తెలిపారు. అలాగే చిత్రం చూడకుండా ఆరోపణలు చేయడం సరికాదని రాంగోపాల్ వర్మ తరఫున న్యాయవ్యాది వాదనలు వినిపించారు. అయితే దీనికి లోకేష్ తరఫున న్యాయవాది ఇంతకు ముందు అయిదారు సినిమాలు తీశారు. ఎలాంటి లాభం లేకపోయిన మళ్లీ తీస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలని నిర్మాత, దర్శకుడు బహిరంగంగా ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్మోహన్రెడ్డిని ఘనంగా చూపించడం, చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగానే సినిమాలు చేస్తున్నారని తెలిపారు. రాజకీయ వ్యంగ్య చిత్రాన్ని నిర్మించి సృజన పేరుతో తమ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.