ఈ ఏడాది ‘ఎఫ్3’ సినిమాతో ఎంటర్టైన్ చేసిన విక్టరీ వెంకటేష్.. విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమాలో దేవుడిగా నటించారు. ప్రస్తుతం వెంకీ చేతిలో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఎఫ్ 3 తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అయితే మరోసారి ‘నారప్ప’ మూవీతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు వెంకీమామ. కరోనా కారణంగా గతేడాది వెంకీ నటించిన నారప్ప, దృశ్యం సినిమాలు ఓటిటిలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ రెండు సినిమాలు కూడా రీమేక్‌గానే తెరకెక్కాయి. అయినా ఓటిటిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ‘నారప్ప’ను థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కు సిద్దం చేస్తున్నారు మేకర్స్. వెంకటేష్ బర్త్ డే కానుకగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయటానికి సురేష్ ప్రొడక్షన్ సన్నాహాలు చేస్తోంది. వెంకటేష్ అభిమానుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో.. డిసెంబర్ 13న ‘నారప్ప’ను థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఆ ఒక్కరోజు మాత్రమే ఈ సినిమాను పలు చోట్ల ప్రదర్శించనున్నారు. దాంతో దగ్గుబాటి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ మధ్య తెలుగులో రీ రిలీజ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటోంది. అందుకే ఇప్పుడు నారప్పను రిలీజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే థియేటర్లోకి వచ్చిన తర్వాత కొత్త సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. కానీ నారప్ప సీన్ మాత్రం రివర్స్‌లో ఉంది. ఓటిటిలోకి వచ్చిన తర్వాత థియేటర్లో రిలీజ్ అవుతుండడం విశేషమనే చెప్పాలి. ఇక ధనుష్ హీరోగా నటించిన తమిళ్ హిట్ మూవీ ‘అసురన్’కి రీమేక్‌గా ‘నారప్ప’ తెరకెక్కింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా.. ప్రియమణి, వెంకీ భార్యగా నటించింది.